- హౌతీల కోస్టల్ రాడార్ సైట్లు, లాంచింగ్ స్టేషన్లపై దాడి
- ఎర్ర సముద్రంలో శాంతి స్థాపిస్తామన్న 20 దేశాలు
వాషింగ్టన్/లండన్: యెమెన్‌లోని హౌతీ స్థావరాలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌తో పాటు మిత్ర దేశాలు భారీ దాడులకు పాల్పడ్డాయి. డ్రోన్లు, మిసైళ్లతో హౌతీ మిలిటెంట్లపై విరుచుకుపడ్డాయి. ఎర్ర సముద్రంలో శాంతి స్థాపనకే ఈ దాడులు చేశామని పది దేశాలు శుక్రవారం సంయుక్తంగా ప్రకటించాయి. వార్‌షిప్‌లు, జలాంతర్గాముల నుంచి టోమాహక్ మిసైళ్లు, ఫైటర్ జెట్లతో డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడినట్టు వెల్లడించాయి.
హౌతీల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కోస్టల్ రాడార్ సైట్లు, డ్రోన్లు, మిసైల్స్ స్టోరేజ్‌తో పాటు లాంచింగ్ స్టేషన్లే టార్గెట్‌గా దాడులు చేశామని అమెరికా, యూకే ప్రకటించాయి. ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపాయి. ఇప్పటికైనా ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే షిప్‌లపై దాడులు, హైజాక్‌లు చేయడం ఆపేయాలని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సౌత్ కొరియా ప్రభుత్వాలు హౌతీ మిలిటెంట్లను జాయింట్ ప్రెస్‌నోట్‌లో హెచ్చరించాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు తగ్గించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పుతామని ప్రకటించాయి.
16 ప్రాంతాల్లో 60 టార్గెట్లు
మొత్తం 16 ప్రాంతాల్లోని 60 టార్గెట్లపై సంకీర్ణ దేశాలు విరుచుకుపడినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ నౌకా మార్గంపై దాడులు చేసే సామర్థ్యాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే హౌతీ మిలిటెంట్లకు చెందిన కీలక ప్రాంతాలపై దాడులు జరిపినట్టు అమెరికా నేతృత్వంలోని కూటమి దేశాలు ప్రకటించాయి. హౌతీల కంట్రోల్లో ఉన్న అతిపెద్ద ఓడరేవు నగరంతో పాటు పలుచోట్ల శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తీరు మార్చుకోకపోతే మరిన్ని దాడులు: బైడెన్
హౌతీలు తమ తీరు మార్చుకోకుండా.. ఇంకా దాడులకు పాల్పడితే.. తాము కూడా కౌంటర్ అటాక్ చేస్తామని హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలు, హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే ఈ దాడులు చేశామని బైడెన్ వివరించారు.
ప్రతీకారం తప్పదు: హౌతీలు
అమెరికా కూటమి జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయారని, ఆరుగురు గాయపడ్డారని హౌతీ హై ర్యాంకింగ్ అధికారి అలీ అల్ – కహౌమ్ ప్రకటించాడు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. యుద్ధం చాలా పెద్దది అని, అమెరికన్లు, బ్రిటన్లకు బుద్ధి చెప్తామన్నారు. కూటమి దేశాల ఊహకు అందని విధంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. యెమెన్‌పై యుద్ధం మొదలుపెట్టి అమెరికా, బ్రిటన్ పెద్ద తప్పు చేశాయన్నారు. గతానుభవాల నుంచి వారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగవని ప్రకటించారు.