అఫ్గానిస్తాన్‌‌‌‌: ఇల్లు కట్టుకోవడానికి మిసైళ్లు వాడారు

అఫ్గానిస్తాన్‌‌‌‌: ఇల్లు కట్టుకోవడానికి మిసైళ్లు వాడారు

మిసైళ్లు, రాకెట్లు.. యుద్ధంలో, శత్రువులపై దాడికి వాడే ఆయుధాలు. కొన్నింటికి ఊళ్లకు ఊళ్లనే నాశనంచేసే సత్తా ఉంటే మరికొన్నింటితో పెద్ద పెద్ద నగరాలనే నామరూపాల్లేకుండా చేయొచ్చు. అలాంటి ప్రమాదకర అస్త్రాలను అఫ్గానిస్థాన్‌‌‌‌లోని ఓ ఊళ్లో ఇష్టమొచ్చినట్టు వాడేశారు. ఉత్తర అఫ్గాన్ లోని క్వెజెలాబాద్‌ లో చాలా ఇళ్లు మిసైళ్లు, రాకెట్లు లేనిదే ఉండవంటే నమ్మండి. ఇల్లు కట్టుకోవడం మొదలు ఇంట్లోని తలుపులు పడిపోకుండా అడ్డుపెట్టుకోడానికి, ఇంటి బీములుగా, ద్రాక్ష తోటల్లో స్తంభాలుగా, చిన్న చిన్న బ్రిడ్జిలుగా కూడా వాడేశారు. ఓ ఇంట్లోనైతే ఫుడ్‌ స్టోర్‌‌‌‌ను నిర్మించేసుకున్నారు. చూడటానికి ఎంత పక్కాగా ఉందో. అదేంటో తెలియక అంతలా వాడేశారు గానీ తెలిశాక గజగజ వణికిపోయారు.

డబ్బుల్లేక..
ఆ గ్రామంలోని ఇజాతుల్లా అనే వ్యక్తి కుటుంబం కూడా రాకెట్లను ఇంటి సీలింగ్‌ బీములుగా వాడింది. తాను చిన్నవాడిగా ఉన్నపుడు పెద్దోళ్లు మిసైళ్లను తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ‘ఇంట్లో పేలుడు పదార్థాలుంటే భయమే కదా.. తొలుత భయమైనా తర్వాత అలవాటైపోయింది’ అన్నారు. ఇంతకీ ఆ రాకెట్లు ఎక్కడివో తెలుసా? 1980 నాటి సోవియట్‌‌‌‌, అఫ్గాన్‌‌‌‌ యుద్ధం నాటివి. సోవియట్‌‌‌‌ మిలటరీ వెళ్లిపోయాక క్వెజెలాబాద్‌ ఊరు నాశనమైపోయింది. ఇళ్లు కూలిపోయాయి. గోడలు పడిపోయాయి. మళ్లీ కట్టుకుందామంటే ప్రజల దగ్గర డబ్బులేదు. అక్కడున్నవల్లా రాకెట్లే. చేసేదేమీలేక వాటితోనే ఇళ్లు కట్టేసుకున్నారు. ఊర్లోని అన్ని ఇళ్లలో కలిపి సుమారు 400 రాకెట్లు ఉన్నట్టు అంచనా.

ప్రపంచానికెలా తెలిసింది?
క్వెజెలాబాద్‌ కు వెళ్లిన ఓ వ్యక్తి చాలా ఇళ్లలో రాకెట్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. సర్కారు వెంటనే డీ మైనర్లను గ్రామానికి పంపింది. ఇంకేముంది? వాళ్లు ఒక్కో ఇంట్లో రాకెట్లను వెతుకడం మొదలెట్టారు. కానీ అలా మిసైళ్లు, రాకెట్లను తీయడం కఠినమైన పని. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పేలుడు ఖాయం. అందుకే కనబడిన వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ట్రక్కుల్లోకి ఎక్కించారు. అలా వెతుకుతున్నపుడు ఓ ఇంట్లో 26 రాకెట్లు గుర్తించామని సిబ్బంది చెప్పారు. వీటిల్లో మొత్తంగా 1,200 కిలోల టీఎన్‌‌‌‌టీ పేలుడు పదార్థం ఉందని, అవి గనక పేలి ఉంటే ఊరు ఊరే నాశనమై ఉండేదని చెప్పారు. బయటకు తీసిన మిసైళ్లను నాశనం చేసేందుకు అఫ్గాన్‌‌‌ సరిహద్దులకు తీసుకెళ్లారు. జాగ్రత్తగా పేల్చారు. గ్రామంలోని చాలా మందికి మిసైళ్లు అంటే ఏంటో, వాటిని ఎందుకు వాడతారో అస్సలు తెలియదు. దీంతో మిసైళ్లు ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చెపట్టింది. మహిళలు, మగవారు అని తేడా లేకుండా అందరికీ వాటి గురించి వివరించడం మొదలెట్టింది.