సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ

సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ
  • 10,800  కరెంట్ పోల్స్ మాయం,  రూ. 3.24 కోట్ల నష్టం 
  • గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరోపణలు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న  సహకార విద్యుత్ సరఫరా సంస్థ ( సెస్ ) కరెంట్ పోల్స్ లెక్క తేలడం లేదు. ఏకంగా 10,800 కరెంట్ పోల్స్ ఎక్కడ వేశారనేది లెక్కలోకి రావడం లేదు. ఒక్కో కరెంట్ పోల్ రేటు  రూ. 3వేల వరకు ఉంటుంది.  మొత్తం 10,800 స్తంభాలకు  రూ. 3.24 కోట్లు అవుతుంది. 2022లో సెస్ కు ఎన్నికలు జరిగి చిక్కాల రామారావు  చైర్మన్ గా నూతన పాలక వర్గం ఏర్పడింది.  గత పాలనలో జరిగిన ఆవినీతిపై ఎంక్వైరీ చేయాలని ఇద్దరు ఏఈలను ఆదేశించారు. 

నత్తనడకన విచారణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలకు సెస్ విద్యుత్ ను సరఫరా చేస్తోంది. అయితే సెస్ పరిధిలో ఉన్న ఆయా మండలాల  డైరెక్టర్లు ఎస్టిమేట్ లేకుండానే ఇష్టానుసారంగా పోల్స్ వేశారు. పోల్స్ వేయడానికి ఏఈలు సైతం అనుమతిచ్చారు.13 మండలాల్లో దాదాపు 10,800 కరెంట్ స్తంభాలు  వేశారని వాటికి సంబంధించి లెక్క తేలట్లేదని ఈ పాలకవర్గం గత 2023 జూన్ లో విచారణకు ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, బోయిన్పల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల్లో  కరెంట్ పోల్స్  వేశారు. వీటికి సంబంధించిన లెక్కలు మాత్రం తేలడం లేదు. 

సెస్ మహా సభ ను నుంచి ఎంక్వైరీ స్పీడప్

రెండు రోజుల కిందట సెస్ 51వ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది.  సెస్ ప్రతినిధులు మాయమైన10,800 స్తంభాల విషయంలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి స్తంభాల లెక్క తీయడంలో ఆఫీసర్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 7 వేల కరెంట్ పోల్స్ లెక్క తేలినట్లు,  మరో 3800 కరెంట్ పోల్స్ లెక్క దొరకట్లేదని సెస్ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. తాజాగా కరెంట్ పోల్స్ ఎటు మాయమయ్యాయి. ఎందుకు ఎస్టిమేషన్  లేకుండా పోల్స్ వేయడానికి అనుమతినిచ్చారు. ఇందులో ఎవరెవరూ పాత్రదారులు అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

విచారణ కొనసాగుతోంది

వివిధ మండలాల్లో వేసిన పోల్స్ కు సంబంధించిన ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పటికే 7 వేల పోల్స్ కు సంబంధించి  ఎస్టిమేషన్ లెక్క దొరికింది.  మరో 3800 పోల్స్ కు సంబంధించిన ఎంక్వైరీ చేస్తున్నాం. అప్పట్లో ఎస్టిమేట్ లేకుండానే రైతులకు  అత్యవసరమైతే  కోసం కరెంట్ పోల్స్ వేశారు. పోల్స్ వేశాక ఎస్టిమేట్ చేయడం మూలంగా సమస్య వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. మరో రెండు నెల్లల్లో కరెంట్ పోల్స్ లెక్క తేలనుంది.

 సెస్ ఎండీ, విజయేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా