బషీర్ బాగ్ , వెలుగు : ఉస్మానియా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ తండ్రి నుంచి నాలుగేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన కేసును 12 గంటల్లో అప్జల్ గంజ్ పోలీసులు చేధించారు. అప్జల్ గంజ్ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బి, బాలస్వామి, ఏసీపి శంకర్, సీఐ లింగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. మల్లెపల్లి మాంగర్ బస్తికి చెందిన మొహ్మద్ సద్దాం తన కుమారుడు సోయాబ్(4) ను తీసుకొని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. వైద్య చికిత్సల అనంతరం కుమారున్ని తీసుకొని ఓపీ భవనం వద్ద మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు. వరంగల్ ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్ (38) మద్యానికి బానిసై ఫుట్ పాత్ పైనే ఉండేవాడు. ఇదే అదునుగా భావించిన రఫీక్ ఒంటరిగా ఉన్న బాలుడిని అతనితో తీసుకొని అక్కడ నుంచి అబిడ్స్ , సుల్తాన్ బజార్, చాదర్ ఘాట్ మీదుగా డబీర్ పురాకు నడుచుకుంటూ వెళ్ళాడు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినా సద్దాం భార్య రుబినా బేగం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చి, మద్యం మత్తులో పడుకుని ఉన్న భర్త ను గుర్తించింది.
అక్కడ బాలుడు కనిపించకపోవడంతో అప్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ స్పెక్టర్ లింగేశ్వరరావు, డీఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని, నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసి, బస్ స్టేషన్లు , రైల్వేస్టేషన్ ల వద్ద ఉన్న సీసీ కెమెరాలు వెతికారు. కిడ్నాపర్ షేక్ రఫీక్ బాలుడిని వెంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. వెంటనే పోలీసులు షేక్ రఫీక్ ను అదుపులో తీసుకొని విచారించారు. బాలుడిని డబ్బులకు విక్రయించేందుకు ఓ మహిళా వద్ద ఉంచానని చెప్పడంతో.. అక్కడికి వెళ్లి బాలుని సురక్షితంగా అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. 12 గంటల్లో కేసు చేధించిన సీఐ లింగేశ్వర్ రావు, డీఎస్ ఐ రామకృష్ణ టీంలను డీసీపీ అభినందించారు.