వరంగల్‌‌‌‌లో మిస్టరీగా మారిన భార్యాభర్తల మిస్సింగ్‌‌‌‌

వరంగల్‌‌‌‌లో మిస్టరీగా మారిన భార్యాభర్తల మిస్సింగ్‌‌‌‌

 

  • తిరుపతికి వెళ్తున్నామని చెప్పి 21న బయటకు వెళ్లిన జంట
  • హనుమకొండ వడ్డేపల్లి చెరువు వద్ద స్కూటీ, ఫోన్లు స్విఛాఫ్‌‌‌‌

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ నగరానికి చెందిన భార్యాభర్తలు ఆరు రోజులుగా కనిపించకపోవడం కలకలం రేపుతోంది. తిరుపతికి వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ఆ జంట ఇప్పటివరకు తిరిగి రాకపోవడం, వడ్డేపల్లి చెరువు వద్ద వారి స్కూటీ కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... హనుమకొండ జవహర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన అయిత సంపత్‌‌‌‌కుమార్‌‌‌‌ చిన్న కొడుకు సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ (44)కు 13 ఏండ్ల కింద హనుమకొండకు చెందిన మానస (40)తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. భార్యాభర్తలిద్దరూ వడ్డేపల్లి చర్చి వద్ద రెండు షట్టర్లు కిరాయికి తీసుకొని కిరాణ షాప్‌‌‌‌ నడిపిస్తున్నారు. 

ఈ నెల 20న రాత్రి 11 గంటల సమయంలో సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ తన తండ్రి సంపత్‌‌‌‌ను కలిసి 21వ తేదీ ఉదయం తిరుపతి వెళ్తున్నామని చెప్పాడు. ఉదయం సంపత్‌‌‌‌ నిద్రలేచే సరికి సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ దంపతులు కనిపించలేదు. దీంతో తిరుపతికి వెళ్లిపోయి ఉంటారని భావించారు. కానీ 24వ తేదీ సాయంత్రం సంపత్‌‌‌‌కుమార్‌‌‌‌కు పరిచయం ఉన్న ఓ వ్యక్తి ఫోన్​చేసి సందీప్‌‌‌‌ స్కూటీ వడ్డేపల్లి చెరువు వద్ద ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన వడ్డేపల్లి చెరువు వద్దకు వెళ్లి చూసి, స్కూటీ సందీప్‌‌‌‌దేనని నిర్ధారించారు. తాళాలు కూడా బండి మ్యాట్‌‌‌‌ కిందే ఉండగా.. డిక్కీలో రెండు చిట్టీ బుక్కులు, ఇన్సూరెన్స్‌‌‌‌ పేపర్లు కనిపించాయి. అనుమానం వచ్చిన సంపత్‌‌‌‌ వెంటనే తన కొడుకు, కోడలు ఫోన్‌‌‌‌ నంబర్లకు కాల్‌‌‌‌ చేయగా స్విచ్ఛాఫ్‌‌‌‌ వచ్చింది. దీంతో గురువారం రాత్రి 7.30 గంటలకు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి 13 ఏండ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడంతో పాటు ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. సంపత్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోద చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కాజీపేట పోలీసులు తెలిపారు.