అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ హత్య.. డ్రగ్స్, కిడ్నీ రాకెట్ ముఠాగా అనుమానం

మూడు వారాలుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మృతి చెందాడు.  ఈ విషయాన్ని న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.  మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ దాదాపు మూడు వారాలుగా తప్పిపోయాడు. అతని రక్షించడానికి అక్కడి అధికారులతో కలిసి రాయబార కార్యాలయ  అధికారులు పనిచేశారు. అయినప్పటికీ అతన్ని  కాపాడలేకపోయారు.  మహ్మద్ అబ్దుల్ మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు అతని కుటుంబానికి సమాచారం అందించామని కాన్సులేట్ తెలిపింది. 

అర్ఫత్ తనతో చివరిసారిగా మార్చి 7న మాట్లాడాడని, అప్పటి నుంచి తన కుటుంబంతో టచ్‌లో లేడని అర్ఫత్  తండ్రి మహ్మద్ సలీమ్ చెప్పాడు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని చెప్పుకొచ్చారు.  యుఎస్‌లోని అర్ఫాత్ రూమ్‌మేట్‌లు క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు  చేశారు.  అయితే మార్చి 19న అర్ఫాత్ కుటుంబానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది, అతను అర్ఫత్‌ను డ్రగ్స్ అమ్మే ముఠా కిడ్నాప్ చేసిందని అర్ఫత్‌ విడుదల చేయడానికి 1,200 డాలర్లు కాలర్ డిమాండ్ చేశాడని అతని తండ్రి తెలిపారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అర్ఫాత్ తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు.  సలీమ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు కూడా లేఖ రాశారు. 

ఈ ఏడాది అమెరికాలో పలువురు భారతీయ, భారతీయ సంతతి విద్యార్థులు మరణించారు. వరుస మరణాలు భారత్ లోని వారి కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.  ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆమెరికా అనేది ఒక గమ్యస్థానంగా మారింది.  2022-2023 సంవత్సరంలో  2.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆమెరికాకు వలస వెళ్లారు.