చైనాలో ప్రముఖుల మిస్సింగ్​ వెనక దాగిన మిస్టరీ ఏంటి?

చైనా తన దేశీయులతోనూ ఉచ్ఛనీచాలు పాటించని డ్రాగన్‌‌‌‌ లాగే ప్రవర్తిస్తోంది. కమ్యూనిస్ట్‌‌‌‌ దేశమైనా కూడా తన దేశ పౌరులతోనే కర్కశంగా వ్యవహరిస్తోంది. జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఎంతటి ప్రముఖులనైనా మాయం చేస్తోంది. వారు ఏమైపోయారో కూడా ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. రికార్డుల్లోంచి వారి డేటాను డిలీట్‌‌‌‌ చేస్తోంది. ఇలా ఆ దేశంలో కనిపించకుండా పోయిన వాళ్లంతా ఎదురు తిరిగిన వారే. కారణాలు, తప్పిదాలు ఏమైనా మిస్సవుతున్న​ ప్రముఖుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే వాళ్ల అదృశ్యం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు చైనా ఎనలిస్ట్‌‌‌‌లు. 

ఇటీవల చైనా టెన్నిస్ ప్లేయర్‌‌‌‌ పెంగ్ షువాయ్ బయటి ప్రపంచం నుంచి మాయమవడం, సెరేనా విలియమ్స్ సహా ఇతర క్రీడాకారులపై ఆమె మిస్సింగ్​పై ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సమాఖ్య చైనాలో అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెంగ్ షువాయ్ కంటే ముందు, ఈ కామర్స్ బిలియనీర్ జాక్ మా, రియల్ ఎస్టేట్ దిగ్గజం రెన్ జికియాంగ్, సినీ నటి ఫ్యాన్ బింగ్‌‌‌‌ బింగ్, పాప్ సంచలనం జావో వీ, బయో ఫిజిసిస్ట్ హీ జియాన్‌‌‌‌కుయ్‌‌‌‌, మాజీ ఇంటర్​పోల్ చీఫ్ మెంగ్ హొంగ్వేయి సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ సందర్భాల్లో కనిపించకుండా పోయారు. వారిలో కొందరు తిరిగి ప్రపంచం ముందుకు వస్తే, కొందరు జైలు పాలయ్యారు. వారి మిస్సింగ్​కు అనేక కారణాలు చెబుతున్నప్పటికీ, వివిధ వేదికలపై వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అసమ్మతి, విమర్శలే దానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వారు పబ్లిక్ ఇంటరాక్ట్‌‌‌‌ పీపుల్‌‌‌‌ కావడంతో మీడియా దృష్టిని ఆకర్షించారు. మీడియా దృష్టికి రాని వారు చాలా మంది ఉన్నారు. కమ్యూనిస్ట్ చైనాలో ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకు జవాబు వెతకాలంటే మొదట ఆ దేశ రాజ్యాంగాన్ని, అక్కడి ప్రజలకు ఉన్న స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవాలి.

చైనా ప్రజలకు స్వేచ్ఛ

మావో కాలంలో చైనా రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. కమ్యూనిజం ద్వారా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందించేందుకు వివిధ సందర్భాల్లో ది గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ప్రవేశపెట్టారు. మావో తర్వాత డెంగ్ జియావోపింగ్1975లో రాజ్యాంగంలో మార్పులు చేశారు. 1977లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) 11వ జాతీయ కాంగ్రెస్ ఆర్టికల్ 45కి నాలుగు స్వేచ్ఛలను జోడించడానికి రాజ్యాంగానికి సవరణలు చేయాలని సిఫార్సు చేసింది. దీని ప్రకారం1978లో సవరించిన రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులు, బాధ్యతలను కల్పించింది. అందులో ముఖ్యమైనవి ‘స్వేచ్ఛగా మాట్లాడే హక్కు’, ‘అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు’, ‘చర్చలు నిర్వహించుకునే హక్కు’, ‘పెద్ద పెద్ద అక్షరాలతో బహిరంగంగా పోస్టర్స్ ప్రదర్శించే హక్కు’లను వీటితో పాటు ‘సమ్మె చేసే హక్కు’ కూడా. డెంగ్ చూపిన చొరవతో పొందిన హక్కులతో చైనా అంతటా ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు, పాలనా వ్యవస్థపై నిరసనలు, ఒకే పార్టీ ఉనికిపై వ్యతిరేకత వచ్చింది. తరువాతి పరిణామాలు చైనీస్ కమ్యూనిజం పునాదులను కదిలిస్తూ ‘బీజింగ్ స్ప్రింగ్’ అనే ప్రజాస్వామ్య ఉద్యమానికి దారి తీశాయి. ఫలితంగా 1980లో చైనీస్ పార్లమెంట్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఈ హక్కులను రద్దు చేయడమే కాకుండా, ఎవరైనా ఈ హక్కుల గురించి మాట్లాడినా, అనుభవించాలని చూసినా అది చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొంది. తరువాతి కాలంలో రాజ్యాంగానికి సవరణలు చేసి1982లో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. అందులోని ఆర్టికల్ 35 ప్రజలకు భావ బ్యాక్తీకరణ హక్కు, వార్తా పత్రికల ద్వారా సమాచారం పొందే హక్కు, వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు,  ప్రదర్శనలు చేసుకొనే హక్కు లాంటివి ఇచ్చినప్పటికీ ఆర్టికల్ 53 ప్రకారం ముఖ్యంగా క్రమశిక్షణకు లోబడి, ఇతరులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, ఇబ్బంది కలిగించకుండా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోషలిజంను సాధించేందుకు సాధనాలుగా ఉండాలి.

రాజ్యాంగ సవరణలు

తరువాతి కాలంలో 1988, 1993, 1999, 2004, 2018 ఇలా మొత్తం ఐదుసార్లు రాజ్యాంగాన్ని సవరించబడినప్పటికీ నాలుగు పెద్ద హక్కులను అందులో చేర్చలేదు. కానీ ప్రైవేట్ రంగానికి అనుకూలంగా, ప్రైవేట్ ఆస్తులు కలిగి ఉండటం ఒక హక్కుగా గుర్తిస్తూ, కొన్ని మానవ హక్కులను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యంగా ప్రకటిస్తూ, మారుతున్న కాలానికి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగ సవరణలు జరిగాయి. చైనా ఒక అభ్యుదయ, ఆధునిక సోషలిస్ట్ దేశంగా, దాన్ని నడిపించే బాధ్యత చైనా కమ్యూనిస్ట్ పార్టీ పైన పెడుతూ ఈ సవరణలు జరిగాయి. 2018లో జరిగిన 13వ నేషనల్ పీపుల్స్‌‌‌‌ కాంగ్రెస్ సమావేశాలు చైనాను ఒకే పార్టీ కలిగిన దేశంగా, బహుళ పార్టీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాయి. 2000వ సంవత్సరంలో జియాంగ్ జెమిన్ ప్రతిపాదించిన మూడు ప్రాతినిధ్యాల సిద్ధాంతం ప్రజలకు, పార్టీకి ఉన్న సంబంధాలను పునర్నిర్వచించింది. దాని ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ, చైనా ఆధునిక ఉత్పాదక శక్తులకు, ఆధునిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి, మెజారిటీ ప్రజల ప్రాధామ్యాలను తీర్చే సాధనంగా, ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ఆధునిక ఉత్పాదక శక్తులలో పారిశ్రామిక వర్గాలను చేర్చింది. ఈ సిద్ధాంతం పెట్టుబడిదారులను, నూతన ఆవిష్కర్తలను, పారిశ్రామిక వేత్తలను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా చేర్చుకోవడానికి అనుమతిచ్చింది. జియాంగ్ జెమిన్ ప్రకారం వీరు తమ కష్టంతో నిజాయితీగా పని చేసి చైనాలో ఒక నూతన సామాజిక వ్యవస్థ ఏర్పడటానికి, చైనా లక్షణాలతో కూడిన సామ్యవాద నిర్మాణానికి కృషి చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రాథమిక ఉద్దేశాలకు, సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్నిస్తే నిర్బంధం

ప్రభుత్వ విధానాలపై, పార్టీ పనితీరుపై, ఏ రకమైన అసంతృప్తి వ్యక్త పరచడానికైనా, అధికారుల పనితీరుపై, పార్టీ కార్యకర్తల వ్యవహారశైలిపై ఎలాంటి విమర్శలకైనా సంబంధిత వేదికలపైనా కాకుండా, సామాజిక మాధ్యమాలను సాధనంగా ఉపయోగిస్తే అది అసంతృప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా, నేరంగా పరిగణించడం ప్రారంభించింది. ఈ విధానం సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు, ధనవంతుల నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకే విధంగా నిర్వర్తిస్తోంది. 2012లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిన్‌‌‌‌పింగ్ అవినీతిపై యుద్ధం ప్రారంభించారు. విమర్శలు గుప్పించే వారిని గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి 18వ సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్​స్పెక్షన్(సీసీడీఐ)ని పునరుద్ధరించారు. షాన్‌‌‌‌గ్గుయీ అని పిలిచే ఈ క్రమశిక్షణా వ్యవస్థ నేర న్యాయ వ్యవస్థకు అతీతంగా పనిచేస్తూ, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని గుర్తించి నిర్బంధిస్తోంది. నిర్బంధించిన వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం సోషల్ మీడియాలో లేకుండా చేస్తోంది. జిన్​పింగ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి క్రమశిక్షణ చర్యలు పెరిగాయి. 2021లో కమ్యూనిస్ట్ పార్టీ తమ కార్యకర్తలకు కొత్త నియమాలు పెట్టింది. దాని ప్రకారం పార్టీపై ప్రభుత్వంపై వ్యతిరేక అభిప్రాయాలు, అసమ్మతి బహిరంగంగా చెప్పకూడదు.  అయితే క్సింగ్​జియాంగ్ ప్రావిన్స్‌‌‌‌లో వీగర్ ముస్లింలను శిక్షణ కేంద్రాలకు తరలించడం, ప్రముఖులను ఇలా బయట ప్రపంచం నుంచి దూరం చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయం చూడాలి.

సోషల్​ మీడియాపై ఆంక్షలు

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఇంకా 1970ల చివరి నాటి అనుభవాలు వెంటాడు తున్నాయి. ఆ సమయంలో నాలుగు పెద్ద హక్కులను ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉపయోగించుకున్న విధానం, ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించిన తీరు, చివరకు కమ్యూనిజాన్ని కూల్చి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలు పార్టీ పెద్దలు ఇంకా మరచిపోలేదు. 1978లో డెంగ్ పారిశ్రామిక, వ్యవసాయక, సాంకేతిక, రక్షణ రంగాలలో ఆధునీకరణలు ప్రతిపాదించినప్పుడు, అప్పటి ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త వెయి జింగ్సేహంగ్, ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ ఆధునీకరణ ప్రతిపాదనల్లో చేర్చాలని పిలుపునిచ్చాడు. 1979 నాటి ప్రజాస్వామ్య ఉద్యమాలు, సోవియట్ యూనియన్ పతనం తర్వాత తినాన్మెన్ స్క్వేర్‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన హింస,  కమ్యూనిస్ట్‌‌‌‌ సిద్ధాంతకర్తల మదిలో ఇంకా  మెదులుతూనే ఉంది. కొత్త సహస్రాబ్దిలో సామ్యవాద దేశం తన కమ్యూనిస్ట్ భావజాలానికి మార్పులు చేసి ఉదారవాద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చెందే క్రమం కూడా అనేక ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలకు తలుపులు తెరిచింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 2010లో ట్యునీషియాలో చెలరేగిన అరబ్ స్ప్రింగ్ ఉద్యమం చైనాలోని ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో స్ఫూర్తి నింపి  2011లో ‘జాస్మిన్ విప్లవానికి’ తెరలేపింది. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా జరిగిన ఈ జాస్మిన్ ఉద్యమం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ వెయిబో సాయంతో విస్తృతంగా వ్యాపించి 13 ప్రధాన నగరాల్లో అనేక ర్యాలీలకు, ప్రదర్శనలకు కారణమైంది. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల ప్రభావం, విస్తృతి, ప్రభుత్వానికి, పార్టీకి తెలిసొచ్చి, సోషల్ మీడియా పైన కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. –డా. గద్దె ఓంప్రసాద్ అసిస్టెంట్‌‌‌‌ ఫ్రొఫెసర్‌‌‌‌‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ వర్సిటీ, సిక్కిం