![అమెరికాలో విమానం మిస్సింగ్.. ఫ్లైట్‌లో ఎంత మంది ఉన్నారంటే..?](https://static.v6velugu.com/uploads/2025/02/missing-plane-in-america_zK7SV53Jfg.jpg)
వాషింగ్టన్: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. యూఎస్‌లో వారం రోజుల క్రితమే ఘోర విమాన ప్రమాదం జరిగి.. 60 మంది మృతి చెందిన ఘటన మురవక ముందే.. తాజాగా మరో విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 2025, ఫిబ్రవరి 6వ తేదీన సెస్నా 208బి గ్రాండ్ కారవాన్ విమానం అదృశ్యమైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
గురువారం (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 10 మందితో అలాస్కాలోని ఉనలక్లీట్ పట్టణం నుంచి టేకాఫ్ అయిన విమానం.. నోమ్ సమీపంలో అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఏటీసీతో విమానం కమ్యూనికేషన్ కోల్పోయిందని సమాచారం. విమానం రాడార్ వ్యవస్థతో సంబంధం కోల్పోవడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అలాస్కా ప్రజా భద్రతా విభాగం అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
2025, జనవరి 30న అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
పీఎస్ఏ ఎయిర్ లైన్స్‌కు చెందిన 5342 విమానం విచిత కన్సాస్ (ICT) నుండి వాషింగ్టన్ రీగన్ జాతీయ ఎయిర్ పోర్ట్ ((DCA) కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను విమానం ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 60 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే అమెరికాలో మరో విమానం మిస్సింగ్ కావడం గమనార్హం.