మిస్సింగ్ అంటూ పోస్టర్లు..  షాక్​ అయిన డ్రైవర్​

విధులకు రావడం లేదనే కారణంతో ఓ ఇంటి యజమానులు కారు డ్రైవర్​ కనిపించడం లేదని పోస్టర్లు వేసిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురానికి చెందిన రామకృష్ణ సోమాజిగూడలోని వైష్ణవి వెంచర్స్ లో 16 సంవత్సరాలుగా డ్రైవర్​ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2న బంధువు మృతి చెందడంతో సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్ళాడు.   పది రోజులైనా పనికి రాకపోవడంతో యజమాని నళిని ఆమె అల్లుడు ప్రకాష్ లు పలుమార్లు ఫోన్ చేసి పనికి రావాలంటూ ఒత్తిడి చేశారు. స్వగ్రామంలో పరిస్థితుల కారణంగా తాము హైదరాబాద్ కు రాలేకపోతున్నామని డ్రైవర్​ వేడుకున్నా యజమాని కనికరించలేదు. అదే విషయంపై కోపంతో డ్రైవర్​ కనిపించడం లేదని యాదగిరి నగర్​తో పాటు, పలు ప్రాంతాల్లో యజమానులు పోస్టర్లు వేయించాడు. నగరానికి తిరిగి వచ్చిన రామకృష్ణ పోస్టర్లను చూసి కంగుతిన్నాడు. ఇదేంటని వారికి ఫోన్ చేయగా ఏం చేసుకుంటావో చేసుకో అని దురుసుగా ప్రవర్తించినట్లు డ్రైవర్​ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణ హాని ఉంది...

నళిని కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, గతంలోనూ తమపై యజమానులు దురుసుగా ప్రవర్తించారని  రామకృష్ణ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.