
- బ్రిలియంట్ కాలేజీ హాస్టల్ నుంచి 6 రోజుల కిందట స్టూడెంట్ మిస్సింగ్
- మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమంటూ స్టూడెంట్ సంఘాల ఆందోళన
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా సెకండియర్ స్టూడెంట్ ఆంజనేయులు (16) మిస్సింగ్ కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లికి చెందిన ఆంజనేయులు బ్రిలియంట్ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 20న ఇంటికి వెళ్తున్నట్లు వార్డెన్‌కు చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్.. అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. తమకు తెలియకుండా హాస్టల్ నుంచి ఎలా బయటకు పంపిస్తారని ఆంజనేయులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడుకు కోసం తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఆంజనేయులు తల్లిదండ్రులు మరోసారి కాలేజీ వద్దకు వచ్చి ప్రశ్నించగా.. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. స్టూడెంట్ సంఘాల నేతలు కాలేజీలోని అద్దాలు, బెంచీలు, కుర్చీలు పగులగొట్టారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ మన్మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆంజనేయులు ఆచూకీ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.