తాడ్వాయి, వెలుగు: ఆలనా పాలన చూస్తుందనుకున్న తల్లి హైదరాబాద్లో తప్పిపోయి 20 రోజులు అవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో పిల్లలు అల్లాడుతున్నారు. అమ్మ జాడ దొరుకుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్కు చెందిన హిమాంబి(గాయత్రి) (35)కి ముగ్గురు ఆడ పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త పాము కాటుతో చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో హిమాంబి క్యాన్సర్ బారిన పడింది.
చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. అయితే హిమాంబి సొంతూరికి రాకపోవడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు హిమాంబి ఆచూకీ దొరకలేదు. ఎక్కడున్నావు అమ్మా..! అంటూ పిల్లలు విలపిస్తున్నారు. తమ అమ్మ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 703647957,6304951655 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.