మిషన్ భగీరథ నీళ్లు రోజుకోచోట కలుషితం అవుతున్నాయ్

మిషన్ భగీరథ నీళ్లు రోజుకోచోట కలుషితం అవుతున్నాయ్
  • ఎక్కడికక్కడ గుంతలు తవ్వి వదిలేసిన సిబ్బంది
  • వరద నీరు చేరి కాలుష్యమవుతున్న మంచినీళ్లు
  • పైపుల్లోకి వెళ్తున్న మురుగు నీరు, బురద
  • రోగాల బారిన పడుతున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో మిషన్ భగీరథ నీళ్లు రోజుకోచోట కలుషితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో ఉన్న లీకేజీలను ఆఫీసర్లు పట్టించుకోకపోవడం, కొన్నిచోట్ల రిపేర్ల కోసమని గుంతలు తవ్వి మధ్యలోనే వదిలిపెట్టడంతో నల్లా నీటిలో మురుగునీరు కలుస్తోంది. ఇటీవల గద్వాల జిల్లాలో కలుషితమైన మిషన్​ భగీరథ నీటిని తాగి నలుగురు చనిపోగా.. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్వాల్సిన ఆఫీసర్లు.. లీకేజీలను లైట్​తీసుకుంటున్నారు.

వందల సంఖ్యలో లీకేజీలు..

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.26 లక్షల ఇండ్లుండగా..  సుమారు 11 లక్షల జనాభా ఉంది. మొత్తం గ్రేటర్​ పరిధిలో దాదాపు 1.20 లక్షల డొమెస్టిక్​ నల్లా కనెక్షన్లు ఉండగా.. 630 కమర్షియల్​ కనెక్షన్లున్నాయి. నగరానికి సమీపంలోని ధర్మసాగర్​ రిజర్వాయర్​, వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల నీటిని ఫిల్టర్​ బెడ్​ ల ద్వారా శుద్ధి చేసి ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.‘రా వాటర్’ మెయిన్ లైన్ 26.7 కిలోమీటర్లు, ఫీడర్ మెయిన్​ 217.33 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్స్​దాదాపు 2900 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. అమృత్​ స్కీం కింద వేసిన కొత్త లైన్లు తప్పితే మిగతా లైన్లన్నీ కొన్నేండ్ల కింద వేసినవి కావడంతో అవి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. గత నెల వరకు సిటీ మొత్తం మీద 3800 వరకు లీకేజీలు ఉండగా.. అందులో 3200 వరకు క్లియర్​ చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అంతకు రెట్టింపు లీకేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో డివిజన్​లో పది నుంచి ఇరవై వరకు లీకేజీలున్నట్లు కింది స్థాయి సిబ్బంది అంటున్నారు. వర్షాకాలం దృష్ట్యా వీటిని ఎప్పటికప్పుడు క్లియర్​ చేయాల్సి ఉండగా.. ఆఫీసర్లు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కాగా కరీంనగర్​ ఎల్​ఎండీ నుంచి వచ్చే రా వాటర్​ దుర్వాసన రావడంతో అండర్​ రైల్వే జోన్​ లో వాటర్​ సప్లై నిలిపివేసి రిపేర్లు చేపట్టారు. అంతకుముందు ధర్మసాగర్​ ఫిల్టర్​ బెడ్​ నుంచి వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేసే మెయిన్ పైపులైన్​ లీకేజీల కారణంగా నాలుగు రోజుల పాటు సప్లై నిలిపివేశారు. ఇలా ఏటా లీకేజీల రిపేర్ల పేరున రూ.లక్షలు ఖర్చు చేస్తున్న లీడర్లు, ఆఫీసర్లు ప్రాబ్లమ్​ రిపీట్​ కాకుండా యాక్షన్​ తీసుకోవడం లేదు.

కలుషితమవుతున్న నీళ్లు..

ఇంటింటికీ తాగునీటి సరఫరాలో భాగంగా ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున నిత్యం నగరం మొత్తానికి 231.28 మిలియన్​ లీటర్లు సప్లై చేయాలన్నది డిమాండ్​. పైపులైన్​ లీకేజీల కారణంగా చాలావరకు నీళ్లు వృథాగా పోతున్నాయి. ఇలా లీకేజీల కారణంగా నిత్యం  20 ఎంఎల్​డీ వాటర్ వృథాగా పోతోందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో లీకేజీలు చూస్తుంటే నిత్యం 50 నుంచి 60 ఎంఎల్​డీ నీళ్లు వేస్ట్​ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు లక్షల లీటర్ల నీళ్లు వృథా అవుతుండగా.. లీకేజీల వల్ల ఇండ్లకు చేరే తాగునీరు కలుషితం అవుతోంది. కొన్నిచోట్ల రిపేర్ల కోసమని ఆఫీసర్లు ఇప్పటికే గుంతలు కూడా తవ్వించారు. కానీ వాటిని సకాలంలో రిపేర్లు చేయకపోవడంతో ఇప్పటికీ అవి అలాగే ఉండిపోయాయి. దీంతో నీళ్లు విడిచిన ప్రతిసారి గుంతలు నిండి బురద తయారవడం, ఆ తర్వాత నల్లాలు బంద్​ చేస్తే అదే బురద నీరు పైపులైన్ లోకి చేరి ఇండ్లకు సరఫరా అవుతున్నాయి. దీంతో కొన్ని దిక్కుల రంగు మారిన నీళ్లు వస్తున్నాయని, అవి తాము రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పొంచి ఉన్న ముప్పు..

వానాకాలం కావడంతో ఇప్పటికే దోమల కారణంగా జనాలు విష జ్వరాల బారిన పడుతున్నారు. దానికి తోడు తాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట గద్వాల జిల్లాలో కలుషితమైన మిషన్​ భగీరథ నీళ్లు తాగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. దాదాపు 56 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ కూడా లీకేజీల సమస్య ఎక్కువగా ఉండటంతో జనాలు మిషన్​ భగీరథ నీళ్లంటేనే జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిషన్​ భగీరథ నీళ్లను పక్కకు పెట్టి వాటర్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. ఇకనైనా గ్రేటర్​ వరంగల్ పరిధిలో లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికి, జనాలు రోగాల బారిన పడకుండా చూడాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇది కాకతీయ యూనివర్సిటీ వంద ఫీట్ల రోడ్డు నుంచి గోపాలపూర్​ వళ్లే మార్గంలో పైపులైన్ లీకేజీ కారణంగా తీసిన గుంత. సకాలంలో పని పూర్తిచేయకపోగా.. ఆ గుంతను అలాగే వదిలేశారు. దీంతో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీళ్లన్నీ ఆ గుంతలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఇండ్లకు సరఫరా అయ్యే నీళ్లు కలుషితమవుతున్నాయి. దీంతో  మిషన్​ భగీరథ వాటర్​ను వదిలేసి వాటర్​ ప్లాంట్లపై ఆధారపడాల్సి వస్తోంది.