రంగుమారిన మిషన్ భగీరథ నీరు

రంగుమారిన మిషన్ భగీరథ నీరు

బాల్కొండ, వెలుగు : ఇంటింటికీ సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు రంగుమారింది. సోమవారం సాయంత్రం  రంగుమారిన నీరు సరఫరా అయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ జలాల్ పూర్ ఇంటెక్ వెల్ నుంచి గ్రామాలకు ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరుచూ పైప్ లైన్ లీకేజీలు, రంగుమారిన నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

శుద్ధి జలం అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ నిర్వహణ లోపంతో ఆభాసుపాలవుతోంది. బాల్కొండ, బోదెపల్లి, వన్నెల్(బి) గ్రామాల్లో సరఫరా చేసిన నీటిని తాగొద్దని మిషన్ భగీరథ ఆఫీసర్లు సెలవిచ్చారు. ఎండాకాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పాలకులు ప్రకటించినా  అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.