గద్వాల, వెలుగు: గద్వాల మండలం గోన్పాడు, శెట్టి ఆత్మకూరు గ్రామాల మధ్య స్టోన్ క్రషర్ కు మిషన్ భగీరథ నీటిని మళ్లిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ నుంచి కనెక్షన్ తీసుకోవడంతో తమ గ్రామానికి తాగునీరు రావడంలేదని గోన్పాడు గ్రామస్తులు ఆరోపించారు. స్టోన్ క్రషర్ ఎమ్మెల్యే బంధువులది కావడంతో ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కనెక్షన్ తొలగించి తమ గ్రామానికి తాగునీరు వచ్చేలా చూడాలన్నారు. నాలుగేళ్ల కిందట రూ. 2లక్షల డిపాజిట్ కట్టి క్రషర్ కి నీటి కనెక్షన్ తీసుకున్నారని మిషన్ భగీరథ ఏజెన్సీ ఐ హెచ్ పి మేనేజర్ మోహన్, ఈఈ భీమేశ్వరరావు తెలిపారు. ప్రతినెల రూ. 14వేల నుంచి 18 వేల బిల్లు వస్తోందని, క్రషర్ నిర్వాహకులు బిల్లు కట్టకపోవడంతో నోటీసులు ఇచ్చి గతంలోనే కనెక్షన్ తొలగించినట్టు చెప్పారు. వారు కట్టిన డిపాజిట్ కూడా జప్తు చేశామన్నారు.