
- శ్రీశైలం రిజర్వాయర్లో 850 అడుగుల వద్ద నీరు
- పొదుపుగా వాడుకోవడంపై ఆఫీసర్ల నజర్
నాగర్కర్నూల్, వెలుగు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆరు జిల్లాలు,19 అసెంబ్లీ నియోజకవర్గాలు,3,200 పైచిలుకు గ్రామాలకు వేసవిలో తాగునీటి కొరత రాకుండా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం 850 అడుగుల వరకు నీటి నిల్వలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వాడుకునేలా ప్రధాన శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎంవో ఆదేశించింది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకున్న భగీరథ అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీల్లో బోర్లు, డైరెక్ట్ పంపింగ్ మోటార్ల లెక్కలు తీశారు. ఈ ఏడాది ఆరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని భగీరథ గ్రిడ్ ఇంట్రా ఈఈ సుధాకర్ సింగ్ తెలిపారు.
అధికారుల ప్రత్యేక దృష్టి..
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్ నుంచి ఎల్లూరు డబ్ల్యూటీపీకి, అక్కడి నుంచి గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్ పహాడ్, కమ్మదనం, రాఘవాపూర్ డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)కి రా వాటర్ సప్లై చేస్తున్నారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలు, ఇతర ఆవాసాలకు సరఫరా చేస్తారు. వేసవిలో ఉమ్మడి మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లో తాగునీటి అవసరాలను అంచనా వేసిన అధికారులు జూన్ వరకు నాలుగు నెలల పాటు శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా వీలైనంత వరకు తాగునీటిని సరఫరా చేసి అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే 37 డిగ్రీలకు ఊష్ణోగ్రతలు చేరడంతో భూగర్భజలాల సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో నీళ్లు వృథాను తగ్గించేందుకు లీకేజీలు, ఓవర్ ఫ్లో సమస్యలు రాకుండా చూస్తున్నారు.
గత ఏడాది అనుభవాలతో..
గత ఏడాది కృష్ణా బేసిన్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. శ్రీశైలం రిజర్వాయర్లోకి అంచనాకు తగ్గట్లుగా నీళ్లు రాలేదు. ఈ సారి రికార్డుస్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్లో వరద నీరు వచ్చి చేరింది. ఏడు సార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎల్లూరు రిజర్వాయర్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో లిఫ్ట్ చేసిన నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేకపోవడం సమస్యగా మారింది. తాగునీటి అవసరాలకు బ్యాక్ వాటర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎల్లూరు రిజర్వాయర్ నుంచి మొదటి డబ్ల్యూటీపీకి ఎత్తి పోస్తున్నారు. అక్కడి నుంచి ఆరు జిల్లాల్లోని డబ్ల్యూటీపీలకు నీటి పంపింగ్ జరుగుతోంది.
నీటి పొదుపు అవసరం..
ఎండల తీవ్రత దృష్ట్యా మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటి వినియోగంలో పొదుపు తప్పదని అంటున్నారు. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో భగీరథ నీటిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఇంట్రా పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం, అసంపూర్తి పైప్లైన్లు, నల్లా కనెక్షన్ల కారణంగా శుద్ధి చేసిన నీరు డ్రైనేజీల పాలవుతోంది. మున్సిపాలిటీల్లో కమర్షియల్ కనెక్షన్లు తీసుకుని వాటర్ సర్వీసింగ్ యూనిట్లు నడిపిస్తున్నారు.
ఇరిగేషన్ అధికారులపైనే భారం..
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటా మేరకు నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉండడంతో, లిఫ్ట్లు, చిన్న రిజర్వాయర్లతో సాగునీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరడం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) భగీరథకు కేటాయించిన నీటి వాటాతో మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మంచినీటి కొరత రాకుండా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్ఈలకు ఇన్చార్జి సీఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించి వేరే జిల్లాలకు పంపించారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఈఈలపై సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే బాధ్యత ఉంది.