మక్తల్, వెలుగు: నాలుగున్నర నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నుంచి మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లోని 56 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి మోటార్లను బంద్ పెట్టి సమ్మె బాట పట్టారు. మక్తల్ మండలం పారేవుల పంప్ హౌజ్ నుంచి మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లోని గ్రామాలకు నీటిని సప్లై చేస్తున్నారు.
4 నెలల 20 రోజుల వేతనాన్ని అధికారులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు వాపోయారు. గత నెల ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని కలవగా, వేతనాన్ని చెల్లించాలని చెప్పారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వేతనాలు చెల్లిస్తేనే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. నర్సింహారెడ్డి, ఆంజనేయులు, రాజప్ప, మనివర్ధన్ రెడ్డి, భుట్టో, లక్ష్మణ్ రావ్, మహేశ్, అనంతయ్య, శ్రీనివాస శెట్టి పాల్గొన్నారు.