
సంగారెడ్డి జిల్లా పెద్దపూర్ దగ్గర NH 65 పక్కనమిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీకైంది.దీంతో అందులో నుంచి వాటర్ హైవే పైకి ఎగిసిపడుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై, కర్ణాటక వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. నీళ్లు వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు.
పక్కన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు అక్కడే సెల్ఫీలు దిగుతున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపు నుంచి నీరు లీకేజీ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇంటింటికి మంచినీటి సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే.. కొన్నిచోట్ల తరచూ పైప్ లైన్ లు లీకై నీరంతా వృథాగాపోతుండడంపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.