గ్రేటర్​ వరంగల్​లో మిషన్​ భగీరథ పైపులు లీకులు

  • లీకుల భగీరథ
  • ఏడాదిలో 5,900 కు పైగా లీకేజీలు.. అతుకులేసి వదిలేస్తున్న ఆఫీసర్లు
  • తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకాలు.. ఎండకాలంలో మరిన్ని తిప్పలు
  • డైలీ వాటర్​ సప్లై కోసం ఐదేండ్లలో రూ.630 కోట్ల ఖర్చు
  • క్వాలిటీ లేక పగుల్తున్న పైపులు, తూతూమంత్రంగా రిపేర్లు
  • సగానికిపైగా పైపులు దశాబ్దాల కింద వేసినవే


హనుమకొండ, వెలుగు:  గ్రేటర్​ వరంగల్​లో మిషన్​ భగీరథ పైపులు తరచూ లీకవుతున్నాయి. రోజూ లక్షల లీటర్ల నీళ్లు వృథాగా పోతున్నాయి. ప్రభుత్వం నుంచి టైమ్​కు నిధులు రాకపోవడంతో అధికారులు తూతూ మంత్రంగా రిపేర్లు చేసి వదిలేస్తున్నారు. ఏడాది కాలంలో ఏకంగా 5,900 సార్లు పైపులు లీకయ్యాయి. దీంతో నగర వాసులకు సరిగ్గా తాగునీటి సరఫరా జరగడం లేదు. కొన్ని కాలనీల్లోనైతే వారం పదిరోజులకు ఒక్కసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ఎండాకాలం సమీపిస్తుండటంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వరంగల్ సిటీలోని 2.25 లక్షల ఇండ్లకు 24 గంటల నీటి సరఫరా కోసం సర్కారు 2017–18లో మిషన్​భగీరథను ప్రారంభించింది. అప్పటికీ నల్లాలు లేని 1.10 లక్షల ఇండ్లకు కొత్తగా నల్లా కనెక్షన్​ ఇవ్వాలని భావించారు. ఈలోగా వరంగల్ సిటీని కేంద్ర ప్రభుత్వం అమృత్​ స్కీం కింద ఎంపిక చేసింది. ఇలా అటు అమృత్​స్కీం, ఇటు మిషన్​భగీరథ స్కీం కింద గ్రేటర్​ వరంగల్​ డ్రికింగ్​ వాటర్​ స్కీం కోసం గడిచిన ఐదేండ్లలో రూ.630 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో సిటీలో కొత్తగా  33 వాటర్​ ట్యాంకులు, 158 కిలోమీటర్ల ఫీడర్​ మెయిన్స్​, 1,380 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయడంతో పాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్ పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న పైపులైన్లను మిషన్​భగీరథ స్కీంలో భాగంగా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉన్నప్పటికీ ఆఫీసర్లు మాత్రం, సగానికిపైగా ఇంట్రా పైపులైన్​బాగానే ఉన్నట్లు రిపోర్ట్​ ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో ఈ 300 కిలోమీటర్ల పైపులైన్లు​పూర్తిగా శిథిలమై, తరుచూ లీకవుతున్నాయి. దీనికి తోడు కొత్త ఇంట్రా పైపులైన్ పనులు క్వాలిటీగా లేకపోవడం, పైపులను తగినంత లోతులో వేయకపోవడంతో ఎక్కడికక్కడ పగులుతున్నాయి. 

సగానికిపైగా లైన్లు దశాబ్దాల కింద వేసినవే

గ్రేటర్​వరంగల్​ మున్సిపల్​కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని 66 డివిజన్లలో రా వాటర్, ఫీడర్​ మెయిన్స్​, డిస్ట్రిబ్యూషన్ లైన్లు అన్నీ కలిపి 3 వేల కిలోమీటర్లకు పైగా పైపులైన్​ వ్యవస్థ ఉండగా.. ఇందులో సగానికి పైగా లైన్లు దశాబ్దాల కింద వేసినవే. వాటిలో సుమారు 300 కిలోమీటర్ల పాత పైపులైన్​పూర్తిగా శిథిలమైనట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. చాలాచోట్ల పైపులైన్ల చువ్వలు కూడా బయటకు తేలి, తరుచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఏడాది కాలంలో 5,900 కు పైగా లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిలో 5,300 లీకేజీలను సరిచేశామని, కానీ ఓవైపు చేస్తుంటే మరోవైపు లీకేజీలు వస్తూనే ఉన్నాయని ఆఫీసర్లు అంటున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ఇప్పటికిప్పుడు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 600 వరకు లీకేజీలున్నాయని,  గ్రౌండ్​ లెవల్​లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని కిందిస్థాయి సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు వరంగల్​సిటీలో కొత్త కాలనీలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా సగటున 4 వేల నుంచి 5 వేల ఇండ్లు నిర్మాణమవుతుండగా.. ఆయా కాలనీలకు కొత్త నల్లా కనెక్షన్ల ఊసేలేదు. 

దేవాదుల నుంచీ ఆటంకాలు.. 

మెయిన్​ గ్రిడ్​ పరిస్థితి మరోలా ఉంది. గ్రేటర్​ వరంగల్ ​స్కీంకు నీళ్లిచ్చే ధర్మసాగర్​ రిజర్వాయర్​కు దేవాదుల పైపులైన్​ ద్వారా వాటర్​ అందుతుంటుంది. కానీ దేవాదుల నుంచి వాటర్​సప్లైకి తరుచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హనుమకొండ జిల్లా పరకాల మండలంలో దేవాదుల పైపులైన్లు పలుచోట్ల పైకి తేలాయి. నెలల తరబడి వాటిని పట్టించుకోకపోవడంతో ధర్మసాగర్​కు పంపింగ్​ నిలిచిపోయింది. దీంతో  రిజర్వాయర్​లో  నీటి మట్టం పడిపోయి, వాటర్​సప్లైకి  ఆటంకాలు తలెత్తాయి. ఇటీవల రిపేర్లు చేసి పంపింగ్​ స్టార్ట్ చేయగా.. మెయింటెనెన్స్​ సరిగా లేక హసన్​పర్తి మండలం ముచ్చర్ల సమీపంలో మరోసారి పైపులైన్​ పగిలిపోయింది. దీంతో మళ్లా నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2021 ఏప్రిల్​ 12న మున్సిపల్​ మంత్రి కేటీఆర్​, గ్రేటర్​వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్ పరిధిలోని రాంపూర్​లో డెయిలీ వాటర్​ సప్లై స్కీంను అట్టహాసంగా ప్రారంభించారు. ఇకపై ప్రతివ్యక్తికి 150 లీటర్ల చొప్పున ఇంటింటికీ డెయిలీ నీళ్లిస్తామని ప్రకటించారు. కానీ, మెయిన్​ గ్రిడ్​ నుంచి సరిపడా నీళ్లు​ అందకపోవడం, ఇటు శిథిలమైన ఫీడర్​ మెయిన్స్​, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు కూడా తరచూ లీకవుతుండడంతో రెండు, మూడురోజుల కోసారి కూడా తమకు నీళ్లు రావడం లేదని పబ్లిక్​ అంటున్నారు. లీకేజీల వల్ల కొన్నిచోట్ల వారం, పదిరోజుల పాటు నీళ్లందని పరిస్థితి ఉంటున్నదని వాపోతున్నారు.

రూ.300 కోట్లడిగితే పైసా రాలే

పైపులైన్ల రిపేర్లు, కొత్త కాలనీలకు కనెక్షన్ల కోసం ఆరు  నెలల కింద రూ.300 కోట్లతో ఆఫీసర్లు రాష్ట్ర సర్కారుకు ప్రపోజల్స్​ పంపించారు. కానీ, ఇంతవరకు ప్రభుత్వం నుంచి పైసా రిలీజ్​ కాకపోవడంతో లీకైన దగ్గర ప్యాచ్​లు వేస్తూ కథ నడిపిస్తున్నారు. సర్కారు నుంచి ఫండ్స్​ వచ్చి లీకేజీ ఉన్న చోట పైపులైన్లు మారిస్తే తప్ప సమస్య తీరదని ఆఫీసర్లు అంటున్నారు.

బోరింగులే దిక్కైతున్నయ్​

మా దగ్గర తరచూ నల్లా నీళ్లు బంద్​అవుతున్నయ్​.  మొన్న వారం నీళ్లు రాక అష్టకష్టాలు పడ్డం. ఆఫీసర్లను అడిగితే రేపిస్తం, మాపిస్తం అంటూ దాటవేస్తున్నరు. ఇంటి అవసరాల కోసం బోరింగుల దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటున్నం. తాగునీటికి వాటర్​ ప్లాంట్ల నుంచి కొనుక్కుంటున్నం. 
-గోవిందుల ఉపేందర్​, హనుమకొండ

పన్నులు కడ్తున్నా.. నీళ్లు ఇస్తలే..

ఆస్తి పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని అన్నీ వసూలు చేస్తున్నరు. కానీ, నీళ్లు మాత్రం సరిగా ఇస్తలేరు. దాదాపు 10 రోజులుగా నీళ్లు వస్తలేవు. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. ఎండలు ఎక్కువైతే పరిస్థితి ఎట్లుంటదో ఏమో. 
- వేల్పుల నవలత, హసన్​ పర్తి