బయటికొస్తున్న భగీరథ అబద్ధాలు నల్లా కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు

బయటికొస్తున్న భగీరథ అబద్ధాలు నల్లా కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు
  • కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ
  • పాత బోర్ల నీటినీ భగీరథ ఖాతాలోనే వేసిన్రు
  • పాతబావులు, బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెలా రూ.80 లక్షల  నుంచి 2 కోట్ల దాకా బిల్లులు
  • రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తేలిన నిజాలు

కరీంనగర్ / నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో మిషన్​ భగీరథ కింద వందకు వంద శాతం ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ప్రతి ఇంటికీ భగీరథ నీళ్లు అందుతున్నాయని అప్పట్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలు, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న గొప్పలన్నీ ఇప్పుడు తప్పులుగా తేలుతున్నాయి. ఇంట్లోకి వచ్చే నల్లా నీళ్లన్నీ మిషన్ భగీరథ నీళ్లు కావని.. బావులు, బోర్ల నుంచి పంపింగ్ అవుతున్న నీళ్లను కూడా భగీరథ ఖాతాలో కలిపేశారనే సంగతి మోటార్ల కరెంట్ బిల్లులు చెప్తున్నాయి.

కొన్ని జిల్లాల్లో అయితే ఇండ్ల కన్నా సర్కార్ చెప్పిన నల్లా కనెక్షన్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల క్షేత్ర స్థాయిలో సర్కార్ చేపట్టిన సర్వే లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత సర్కార్ హయాంలో మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు సగం మాత్రమే వచ్చినా, పూర్తిగా రాకపోయినా వస్తున్నట్టుగానే సెక్రటరీలు, సర్పంచ్ ల సంతకాలతో  బలవంతంగా రిపోర్టులు తీసుకున్న వ్యవహారాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి ఈ స్కీమ్ కింద  వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్స్, పైప్ లైన్లు ఏర్పాటు చేసినా.. గ్రామాల్లో సగం ఇండ్లకు కూడా తాగునీరందడం లేదు.

 దీంతో గ్రామపంచాయతీల్లో పాత బావులు, బోర్లకు మోటార్లు పెట్టి సర్పంచ్ లు, సెక్రటరీలు తాగునీటిని సప్లై చేయాల్సి వస్తోంది. భగీరథ స్కీమ్ వచ్చాక జీపీలకు ఇక కరెంట్ బిల్లుల భారం ఉండదని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ.. గ్రామాల్లో ఏనాడూ మోటార్ల కరెంట్ బిల్లులు జీరో వచ్చింది లేదని, స్కీమ్ మొదలైనప్పటి నుంచి సమాంతరంగా బోర్లు, బావులు వాడకం ఉందని పంచాయతీ సెక్రటరీలు, తాజా మాజీ సర్పంచులు వెల్లడిస్తున్నారు. 

నల్లా కనెక్షన్లపై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు

మిషన్ భగీరథను సక్సెస్ ఫుల్ స్కీమ్​గా చూపేందుకు గత సర్కార్ తాపత్రయపడింది. వందకు వంద శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్టు కేంద్రానికి నివేదికలు ఇచ్చింది. ఫలితంగా కేంద్రం.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించిన జల్ శక్తి మిషన్ నిధులు కోట్లాది రూపాయలు తెలంగాణకు రాకుండా పోయాయి.  కొన్ని జిల్లాల్లో సర్కారు మెప్పు కోసం అధికారులు ఓవరాక్షన్ ​చేశారు. ఉన్న ఇండ్లకన్నా నల్లా కనెక్షన్లే ఎక్కువ చూపారు. తాజా సర్వేలో ఆ తప్పుడు లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి.

 ఉదాహరణకు నిజామాబాద్​ జిల్లాలో 2,59,580 ఇండ్లు ఉండగా, ఏకంగా  2,86,159 మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చినట్టు,  మనిషికి రోజుకు 100 లీటర్ల చొప్పున అందిస్తున్నట్టు రికార్డుల్లో రాసుకున్నారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యాదాద్రి జిల్లాలో కొన్ని ఇండ్లకు ఒకటే నల్లా కనెక్షన్​ ఇచ్చినా, అవే ఇంటి నంబర్లపై రెండు నుంచి మూడు కనెక్షన్లు ఇచ్చినట్టు రాసుకున్నారు. ఈ జిల్లాలో ఖాళీ ప్లాట్లకు, కూలిపోయిన ఇండ్లకు సైతం కనెక్షన్లు ఇచ్చినట్టు నమోదు చేశారు. ఇలా ఒక్కో గ్రామంలో వందకు పైగా డబుల్ కనెక్షన్లు ఇచ్చినట్టు చూపి, ఆ మేరకు డబ్బులు కొట్టేశారు. ఈ జిల్లాలో ఇండ్ల సంఖ్యకు మించి సుమారు 20 వేల కనెక్షన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

బీఆర్ఎస్​ సర్కారు చెప్పినట్టు 100% ఇండ్లకు మిషన్​భగీరథ కనెక్షన్లు ఎక్కడా లేవు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సర్వేలో నల్లా కనెక్షన్లు లేనివి, ఆన్​లైన్​లో నమోదు కాని ఇండ్లే సుమారు 2 లక్షల వరకు ఉన్నట్టు  తేలింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 78 వేలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.24 లక్షల వరకు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్న 1.70 లక్షల ఇండ్లు సర్వే చేస్తున్న క్రమంలో.. కొత్తగా 56 వేల ఇండ్లను గుర్తించారు. 

ఇందులో కొన్ని ఇండ్లలో నల్లా కనెక్షన్లు లేకపోవడం, లేదంటే కనెక్షన్ ఉన్నా ఆన్ లైన్ లో ఎంట్రీ కాకపోవడంతో ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నారు. నల్లా కనెక్షన్ల సంఖ్యను ఎక్కువగా చూపేందుకు ఖాళీ ప్లాట్లలో నల్లా ఉన్నట్టు, ఒకే ఇంట్లో రెండు, మూడు నల్లాలు ఉన్నట్టు నమోదు చేశారు. ఇలాంటి అనేక విషయాలు ఇటీవల అంగన్ వాడీలు, పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన మిషన్ భగీరథ సర్వేలో వెలుగు చూస్తున్నాయి. 

నడుస్తున్న బోర్లు.. మోతెక్కుతున్న బిల్లులు..

మిషన్ భగీరథ స్కీమ్ అమల్లోకి వస్తే నేరుగా పైప్ లైన్ల ద్వారా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులకు, అక్కడి నుంచి నల్లాలకు నీళ్లు వస్తాయని, దీంతో అప్పటిదాకా ఉన్న పాత బావులు, బోర్లు బంద్ ​పెట్టుడేనని, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కరెంట్ బిల్లుల భారం ఉండదని పలు సందర్భాల్లో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ రాష్ట్రంలోని 90% గ్రామాల్లో భగీరథ నీళ్లు సరిపడా రాక బావులు, బోర్లను వినియోగిస్తున్నారు. దీంతో నెలనెలా కరెంట్ బిల్లులు, మోటార్లు కాలితే రిపేర్ ఖర్చులు లక్షల్లో అవుతున్నాయి.

 చిన్న గ్రామాల్లో నెలకు రూ.50 వేల వరకు, పెద్ద గ్రామాల్లో రూ.లక్షన్నర వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా బోర్లు, బావుల్లో మోటార్లను రన్ చేసేందుకు 3,904 విద్యుత్ సర్వీసులు ఉండగా, సగటున నెలకు రూ.1.94 కోట్ల కరెంట్ బిల్లు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో 2,508 విద్యుత్ సర్వీసులు ఉండగా.. నెలకు రూ.1.77 కోట్లు, యాదాద్రిలో 2,383 సర్వీసులకు రూ.1.65 కోట్లు, సిద్దిపేటలో 2,164  సర్వీసులు ఉండగా రూ.1.60 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 2,067 సర్వీసులు ఉండగా రూ.1.60 కోట్లు, ఖమ్మం జిల్లాలో 1,760 సర్వీసులు ఉండగా.. నెలకు రూ.1.50 కోట్ల బిల్లు వస్తోంది. ఈ కరెంట్ బిల్లులన్నీ స్ట్రీట్ లైట్స్, నర్సరీలకు సంబంధించినవి కాకుండా కేవలం డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం వినియోగించే మోటార్ల బిల్లులు మాత్రమే కావడం గమనార్హం. 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి మిషన్ భగీరథ పైప్ లైన్ సరిగా లేక భగరీథ నీళ్లు అరకొరగా సప్లై అవుతున్నాయి. దీంతో చెల్పూర్ లోని 4 మంచినీళ్ల బావుల ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నాలుగు బావులపై ఏర్పాటు చేసిన 8 మోటార్లకు సంబంధించి నెలకు రూ.లక్ష వరకు కరెంట్ బిల్లు వస్తోందని పంచాయతీ సిబ్బంది చెప్తున్నారు.

నెలకు రూ.లక్షన్నర కరెంట్ బిల్లు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో 1,430 ఇండ్లు ఉండగా.. సుమారు 8 వేల జనాభా  ఉంది. ఈ  గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు 5 బావులు, 5 బోర్లను వినియోగిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లు నెలకు రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు వస్తోంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే 15వ ఫైనాన్స్ నిధుల్లో 20 శాతానికి పైగా కరెంట్ బిల్లులకే వెచ్చించాల్సి వస్తోంది.