- ఎల్లూరు వాటర్ గ్రిడ్‌లో నిలిచిన పంపులు
- ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పంప్‌హౌస్‌లకు తాళం
- మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీటికి ఎఫెక్ట్?
నాగర్ కర్నూల్, వెలుగు: మిషన్ భగీరథకు కష్టాలు తప్పేలా లేవు. ఈ స్కీమ్‌లో పనిచేస్తున్న కార్మికులు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని నాలుగేండ్లుగా డిమాండ్ చేస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంతో శుక్రవారం సమ్మెకు దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరందించే కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వాటర్ గ్రిడ్‌లో పంపులు బంద్ పెట్టారు. గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, జడ్చర్ల, మక్తల్‌తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్‌లకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. వీరికి సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.
1,600 మంది వర్కర్లు
ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో లైన్‌మెన్స్, టెక్నీషియన్లు, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, హెల్పర్లు, సూపర్ వైజర్లు కలుపుకొని 1600 మంది వరకు పనిచేస్తున్నారు. ఆపరేటర్లకు రూ. 11,600, లైన్‌మెన్లు ఇతర కార్మికులకు రూ.10,500 జీతం ఇస్తున్నారు. 2017 నుంచి ఇవే వేతనాలు చెల్లిస్తున్నారు. జీవో నెం.11 ప్రకారం ఏటా వేతనాలు పెంచాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో సగం జీతం కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. దసరాకు బోనస్ ఇవ్వడం లేదని, ప్రావిడెంట్ ఫండ్ షేర్ జమచేయడంలేదని వాపోతున్నారు. లైన్‌మెన్లు, ఫిట్టర్లకు టీఏ లేకపోవడంతో జీతం నుంచే పెట్రోల్ ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీతో చర్చలు జరిపినా..
ఇటీవల మహబూబ్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద వర్కర్లు ధర్నాకు దిగగా. అధికారులు, ఏజన్సీ నిర్వాహకులు వారితో చర్చలు జరిపారు. కార్మికులు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు పెంచాలని, పీఎఫ్ ఫండ్ జమ, గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు తదితర 11 డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. డిసెంబర్ 15 వరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా..అమలు చేయకపోవడంతో సమ్మెకు దిగామని కార్మికులు చెబుతున్నారు.
రంగంలోకి ఇంజనీర్లు, పోలీసులు
మిషన్ భగీరథ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్లు గ్రిడ్, డబ్ల్యూటీపీల్లో పంపులు బంద్ పెట్టి సమ్మెకు చేపట్టడంతో వాటర్ గ్రిడ్ ఎస్‌ఈ, ఈఈ, పోలీసులు రంగంలోకి దిగారు. భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుధాకర్ సింగ్ పోలీసులు ఎల్లూరుకు చేరుకున్నారు. కార్మికులతో చర్చలు జరిపినా వినే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మిషన్ భగీరథను మెయింటేన్ చేస్తున్న ఏజెన్సీ.. ఇతర ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులను తీసుకురానున్నట్లు తెలిసింది.
తాగునీటికి ఇబ్బందేనా..?
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీటికి ఎల్లూరు గ్రిడ్ కీలకం. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి రా వాటర్ లిఫ్ట్ చేసి గౌరిదేవిపల్లి, కల్వకుర్తి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా అవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని కమ్మదనం, అయ్యసాగరం, మహబూబ్‌నగర్, వనపర్తి డబ్ల్యూటీపీలకు నీటి సరఫరా జరుగుతోంది. కానీ, గ్రిడ్‌లు, డబ్ల్యూటీపీలు బంద్ పెట్టడంతో రెండు ఉమ్మడి జిల్లాలపై ప్రభావం పడనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫీల్డ్ లెవల్‌లో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.