- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో మంత్రి సీతక్క మిషన్ భగీరథ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా.. ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న శుద్ధమైన తాగునీటిపై పల్లెల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆర్వో ప్లాంట్లు, బోరు వాటర్ద్వారా తలెత్తే సమస్యలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు విధిగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టాలని కోరారు.
రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో క్రాష్ ప్రోగ్రాం నిర్వహించి డిపార్ట్ మెంట్ అధికారులు, పంచాయతీలను సన్నద్ధం చేయాలని సీతక్క ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.