భగీరథ సిబ్బందికి వేతన కష్టాలు .. తెలంగాణలో 18 వేల మందికి 9 నెలలుగా అందని జీతాలు

భగీరథ సిబ్బందికి వేతన కష్టాలు .. తెలంగాణలో 18 వేల మందికి 9 నెలలుగా అందని జీతాలు
  • ఆర్థిక శాఖ వద్ద పెండింగ్​లో ఫైల్
  • నెలల తరబడి ఉద్యోగుల అరిగోస 
  • భగీరథ సిబ్బంది చేతులెతేస్తే గొంతెండాల్సిందే 

హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందక అరిగోస పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక, ఇతర పనులు చేయలేక ఆందోళన చెందుతున్నారు. మంత్రి సీతక్క స్వయంగా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినా.. వేతనాలు విడుదల కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. వేసవిలో సిబ్బంది చేతులెత్తేస్తే ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని.. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. 

మిషన్ భగీరథలో18 వేలపైగా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులుగా సర్వీస్ చేస్తున్నారు. గ్రామంలోని ఇంటింటికీ నీటి సరఫరా జరిగేలా చూస్తున్నారు. ఎక్కడ నీటి పైప్ లైన్ లీకేజీ అయినా.. వివిధ కారణాలతో నీటి సరఫరా నిలిచిపోయినా వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. అయితే, వీరికి ప్రతినెలా వేతనాలు చెల్లించాల్సి ఉన్నా.. జాప్యం జరుగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 నెలల నుంచి వారికి జీతాలు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఎందుకీ జాప్యం?

ప్రతి నెలా మిషన్ భగీరథ సిబ్బంది వేతనాలకు సంబంధించిన ఫైల్​ను ఆర్థిక శాఖకు అప్రూవల్ కోసం పంపిస్తారు. ఆర్థిక శాఖ అప్రూవల్ చేస్తేనే వేతనాలు పడతాయి. కానీ ఫైల్స్​కు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వేతనాలు రావడం లేదని చెప్తున్నారు. అప్రూవల్ ఎందుకు ఇవ్వడం లేదు.. శాఖలో నిధులు లేకపోవడమా? ఉన్నతాధికారులు చొరవ తీసుకోకపోవడమా? లేకుంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. అసలు శాఖలో ఏం జరుగుతోంది. సిబ్బందిపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారనేది ఉన్నతాధికారులకే తెలియాలి. భగీరథపై మంత్రి సీతక్క తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు పెండింగ్​లో ఉండొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు.

 అయినా వేతనాలు పెండింగ్​లో ఉంటున్నాయంటే.. మంత్రి ఆదేశాలనూ పట్టించుకోవడం లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం వేతనాలు రిలీజ్ చేసినా.. కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదా? కావాలనే జాప్యం చేస్తున్నారా? వారిపై ప్రభుత్వ నిఘా కొరవడిందా? అన్న అనుమానాలూ లేకపోలేదు. అసలు ఎక్కడ లోపం జరుగుతుందనేది ప్రభుత్వం ఆరా తీసి సిబ్బందికి నెలనెలా వేతనాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. 

జీతాల కోసం పోరాటం చేస్తాం  

మిషన్ భగీరథ సిబ్బందికి తొమ్మిది నెలలుగా వేతనాలు రావడం లేదు. కొందరు సమస్య తీవ్రత గురించి చెప్పారు. జీతాలు అందకపడుతున్న ఇబ్బందులు వివరించారు. పని చేస్తే పూట గడిచే పరిస్థితి వారిది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వేతనాలు ప్రతినెలా చెల్లించేలా చూడాలి. ప్రభుత్వం వేతనాలు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదని కూడా మా దృష్టికి వచ్చింది. వారిపైనా ప్రభుత్వం నిఘాపెట్టి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారిని బ్లాక్ లో పెట్టాలి. సిబ్బందికి వేతనాలు చెల్లించకపోతే కార్మికులు పక్షాన పోరాటం చేస్తాం.  

 ఎర్రగాని నాగన్నగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ