ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ ‘సమ్మర్​ సర్వే’ పూర్తి

ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ ‘సమ్మర్​ సర్వే’ పూర్తి
  • మార్చి 15 నాటికి అవసరమైన రిపేర్లు చేసేలా ప్లాన్ 
  • కొత్తగా ఏర్పడ్డ కాలనీలకు నీటి సరఫరాకి కసరత్తు 
  • అనుకోని ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఖమ్మం, వెలుగు : జిల్లాలో మిషన్ భగీరథ అమలు, వేసవిలో తాగునీటి ప్రణాళికపై ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పది రోజుల పాటు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి, ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో మిషన్ భగీరథ లైన్ ఏదైనా డామేజ్ అయితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను గుర్తించారు. హ్యాండ్ బోర్ల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 931 గ్రామాలకు ఐదు గ్రామాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో 8502 చేతిపంపులు ఉండగా, సర్వేలో 363 బోర్ల మరమ్మతులు అవసరం అని గుర్తించారు. 

280 సింగిల్ ఫేస్ మోటార్లలో, 17 మోటార్లు వర్కింగ్ లో రిపేర్లు అవసరమైనట్లుగా గుర్తించారు. 1440 బోర్లకు గాను 38 రిపేర్లకు చేయించాలని గుర్తించారు. 270 చోట్ల బావుల నుంచి ప్రత్యామ్నాయాలు చేశారు. వీటన్నిటినీ రిపేరు చేయించి మార్చి 15 వరకు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  చాలా చోట్ల అధికారులు చెబుతున్న దానికి, గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితికి తేడాలున్నాయి. 

  •    కూసుమంచి మండలంలో 41 గ్రామ పంచాయతీలు ఉండగా గురువాయిగూడెం, వాల్యాతండ, జుజ్జల్ రావుపేట గ్రామాలకు పైపులు జామ్ కావడంతో రెండు నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం‌‌‌‌‌‌‌‌లేదని గ్రామస్తులు చెబుతున్నారు. 
  •     సత్తుపల్లి మండలంలో కిష్టారం, చెరుకుపల్లి, జగన్నాధపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కిష్టారం, జగన్నాథపురం, చెరుకుపల్లిలో వాటర్ పైప్ లైన్ ఉంది. ట్యాంకులు కట్టారు కానీ జగన్నాథపురంలో గేట్ వాల్ పనిచేయడం లేదు. మిషన్ భగీరథ, సింగరేణి అధికారుల మధ్య సమన్వయలోపంతో రాత్రి సమయంలో నీరు వృథాగా పోతోంది. దీంతో చెరుకుపల్లికి నీళ్లు అందడం లేదు. కిష్టారంలో గ్రావిటి ఫోర్స్ కు నీళ్లు అందడం లేదు. ట్యాంక్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. ప్రస్తుతం అక్కడున్న బోర్ మోటార్ ను కనెక్ట్ చేసుకొని నీళ్లు వాడుకొంటున్నారు.
  •    కల్లూరు మండలంలో నాసిరకం పైపుల నిర్మాణంతో అనేక ప్రాంతాల్లో పైప్ లైన్లు పగిలిపోవడం, లీకేజీలు అవడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. కిష్టయ్య బంజర దళిత కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాల వారు గత రెండు సంవత్సరాలుగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలనీవాసులు ఖాళి బిందెలతో రోడ్డుపైన నిరసన వ్యక్తం చేశారు. 
  •    కల్లూరు మండలం పడమర లోకవరంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకునకు నీటిని సరఫరా చేసేందుకు గతంలో వేసిన పైపులైన్లు తక్కువ పరిణామం కావడంతో ట్యాంకుకు నీళ్లు ఎక్కించడం కోసమే సుమారు ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతుంది. దీనిపై ఇటీవల ఎమ్మెల్యే మట్టా రాగమయి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో వాటర్ ట్యాంకు నీటిని ఎక్కించేందుకు బోరు వేశారు.