కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో మిషన్‌భగీరథ నీటి సప్లయ్ ఇంటింటా సర్వే చివరి దశకు చేరుకుంది. జిల్లాలో గురువారం వరకు సర్వే 85.88 శాతం కంప్లీట్ కాగా మిగతా14.12 శాతం పూర్తి చేయడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లయ్ ఏ మేర ఉంది నల్లాల వినియోగం, అవసరాలకు సరిపోతుందా లేదా, సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయంగా నీటిని ఏ విధంగా సప్లయ్ చేయాలని ప్రభుత్వం ఇంటింటా సర్వే చేపట్టింది.
తరచు లీకేజీలు
మిషన్ భగీరథ పైపులైన్లలో తరచూ లీకేజీలు, సప్లయ్ లో సమస్యలు ఏర్పడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికంగా సింగింల్ ఫేజ్, త్రీఫేజ్ మోటార్లను వాడాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంకా నల్లా కనెక్షన్లు లేని ఇండ్లు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఈ వివరాలు సేకరిస్తున్నారు.
ఇందు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, నల్లా ద్వారా నీళ్లు ఎంత మేర వస్తున్నాయనే వివరాలు సేకరించి, ఇంటి యజమాని ఫొటోతో యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో కొన్ని గ్రామాల్లో సరిపడా నీళ్లు సప్లయ్ కావట్లేదనే విషయం స్పష్టమవుతోంది. నల్లాల బిగింపు కూడా సరిగా లేనట్లు అధికారులు గుర్తిస్తున్నారు.
జిల్లాలో 2,31,469 ఫ్యామిలీలు ఉన్నాయి. గురువారం వరకు1,98,795 (85.88 శాతం) ఇండ్ల సర్వేకంప్లీట్ అయ్యింది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే కామారెడ్డి డివిజన్లో 88,851 కుటుంబాలు ఉండగా.. 76,009 ఫ్యామిలీస్ ( 85.55 శాతం) సర్వే పూర్తయ్యింది. బాన్సువాడ డివిజన్లో 98,476 ఇండ్లలో 85,706 ఇండ్లు( 87.03 శాతం) , ఎల్లారెడ్డి డివిజన్లో 44,142 ఫ్యామిలీస్ ఉండగా ఇందులో 37,080 ( 84 శాతం) ఇండ్లలో సర్వే పూర్తయింది.
పేర్లు లేనివి, కొత్తగా ఇండ్ల నిర్మాణం 40 వేలకు పైగా ఉన్నాయి. సర్వే2 రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్కానున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. నీటి సప్లయ్ పరిస్థితితో పాటు, ఎండకాలంలో సమస్య తలెత్తినప్పుడు ఏ మేర నీటిని సప్లయ్ చేయాలి అనే వివరాలు ఈ సర్వే ద్వారా తెలియనున్నట్లు జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు.