- ఐదేళ్లుగా సాగుతున్న ట్యాంకుల నిర్మాణం
- 60 శాతం కూడా పూర్తి కాని పైప్లైన్పనులు
- తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంట్రో పూర్తయినా మెయిన్ లైన్లలో సమస్యలు వస్తుండటంతో పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో రోజూ నీళ్లు సరఫరా కావడం లేదు. పెద్దపల్లిలో 2016లో ప్రారంభించిన భగీరథ పనులు ఇప్పటికి 60 శాతమే పూర్తి కావడం, ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రెండు మెగా ట్యాంకుల నిర్మాణం ఇంకా కొనసాగుతుండడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అర్బన్ భగీరథకు మోక్షమెప్పుడో..
మిషన్ భగీరథ కోసం పెద్దపల్లి పట్టణానికి ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించింది. పట్టణంలో 118 కిలో మీట్లర్ల పైప్‌లైన్‌తో పాటు, 1200 కేఎల్, 2100 కేఎల్ కెపాసిటీతో రెండు ట్యాంకులు నిర్మిస్తున్నారు. 1200 కేఎల్ కెపాసిటీ ట్యాంకుకు రూ.1.78 కోట్లు, 2100 కేఎల్ కెపాసిటీ ట్యాంకుకు రూ.2.50 కోట్లు కేటాయించారు. ట్యాంకుల నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. ఇలాంటి పరిస్థితే జిల్లావ్యాప్తంగా ఉంది.
వాటర్ సప్లయ్‌లో ఫెయిల్..
పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు వాటర్సప్లై చేయడంలో విఫలమవుతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ప్రభుత్వంతోపాటు సింగరేణి, ఎన్టీపీసీలు అభివృద్ధి పనుల్లో చేయూతనిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి చొరవతో పెద్దపల్లి బొంపెల్లి గుట్ట మీద సంపు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పట్టణానికి అక్కడి నుంచే తాగునీరు సప్లయ్ అవుతోంది ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటిని అందించలేకపోతున్నారు. సుల్తానాబాద్ పట్టణంలో గట్టెపల్లి వాగులో ఏర్పాటు చేసిన పంపుల ద్వారా తాగునీరు అందించే వారు. కానీ ఇటీవల వచ్చిన వరదలకు అవి కొట్టుకుపోయాయి.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది
మంచినీటి సమస్య పరిష్కారం కావాలంటే భగీరథ పనులు త్వరగా పూర్తిచేయాలి. ట్యాంకుల నిర్మాణంతో పాటు సిటీల్లో పైపులు వేయడం త్వరగా కంప్లీట్ చేయాలి. పట్టణంలో రెండు, మూడు రోజులకోసారి ట్యాపులు వస్తున్నాయి. కౌన్సిల్లో సమస్యపై మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
- రాజం మహంత కృష్ణ, కౌన్సిలర్, పెద్దపల్లి