బీఆర్ఎస్ వైపే మొగ్గు.. మిషన్ చాణక్య సర్వే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిషన్ చాణక్య ఎలక్షన్ స్టడీ సంస్థ స్టేట్ మూడ్​ను విడుదల చేసింది. నారాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం పేరుతో చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని తేల్చింది. బీఆర్ఎస్​కు 44.62 శాతం, కాంగ్రెస్​కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వచ్చే చాన్స్ ఉందని వెల్లడించింది. 

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 72 నుంచి 76, కాంగ్రెస్ 25 వరకు, బీజేపీ 9 నుంచి 10, ఎంఐఎం ఏడు సీట్లు గెలుస్తుందని పేర్కొంది. మేనిఫెస్టో విడుదల తరువాత బీఆర్ఎస్​కు మహిళల్లో ఆదరణ పెరిగిందని, అత్యధికంగా 37శాతం మంది నిరుద్యోగులు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పింది. గ్యారంటీలతో కాంగ్రెస్ కాస్త పుంజుకుందని, అయినప్పటికీ ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉందని తెలిపింది. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని వెల్లడించింది. 

మిషన్ చాణక్య చైర్మన్ అముక శివకేశవ్ మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి స్టేట్ మూడ్​ను అబ్జర్వ్ చేస్తున్నామన్నారు. కొన్ని పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు కనుక వారిని కూడా ప్రకటిస్తే ఎన్నికల సమయానికి ఈ అంచనాలు మారవచ్చని చెప్పారు.