
హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రస్తుత కాంపిటీషన్ యుగంలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమంటే మామూలు విషయం కాదు. పదో తరగతి విద్యార్హత ఉన్న జాబ్‌కి డిగ్రీలు, పీజీలు చేసినవాళ్లు కూడా పోటీపడుతున్నారు. వంద పోస్టులకు లక్ష మంది కాంపిటీషన్లో ఉంటున్నారు. మరి అంతటి పోటీ ఉన్న నౌకరీ కొట్టాలంటే మంచి కోచింగ్ తప్పనిసరి. కానీ.. లక్షల రూపాయలు కట్టి కోచింగ్ తీసుకోవాలంటే పేదలకు తలకుమించిన భారమే. అందుకే అలాంటివాళ్లకు అండగా నిలుస్తున్నారు పోలీస్ ఆఫీసర్ ఏడుకొండలు. తానే స్వయంగా క్లాసులు చెప్తూ.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ల్లో నెగ్గేలా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు.. మోటివేషన్ సెషన్స్, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ.. ప్రజాసేవ కూడా చేస్తున్నారు.
అన్ని రంగాల్లో తన శిష్యులు ఉద్యోగులుగా ఉండాలనేలక్ష్యంతో పనిచేస్తున్నారు ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు. అందుకే “మిషన్ ఏడుకొండలు” పేరుతో లక్షల మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. 2015లో ఈ మిషన్ మొదలైంది. ఆన్లైన్, యూట్యూబ్, జూమ్ మీటింగ్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్లాసులు చెప్తున్నారు. 2020 కరోనా టైంలో 25వేల మంది విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోచింగ్ ఇచ్చారు. ఈ మిషన్ మొదలయ్యి పదేండ్లు అవుతోంది. ఇప్పటివరకు సుమారు రెండు లక్షల మందికి పైగా కోచింగ్ ఇచ్చారు. వాళ్లలో ఐదు వేల మందికిపైగా రాష్ట్ర ప్రభుత్వంలో, 300 మందికి పైగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు సాధించారు.
డిపార్ట్మెంట్లో గుర్తింపు
సీఐ ఏడుకొండలుది నల్గొండ జిల్లాలోని నామనివాణికుంట అనే కుగ్రామం. తల్లిదండ్రులు బాలనర్సయ్య, అమ్మ లింగమ్మ వ్యవసాయం చేస్తే ఏడుకొండలుని చదివించారు. కానీ.. ఆయన 8వ తరగతిలో డ్రాప్ అవుట్ అయ్యారు. మళ్లీ తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో చదువు కొనసాగించారు. 2009లో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తున్నా ఆయనకు సంతృప్తి లేదు. అందుకే పేదల కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో 2015లో ‘‘మిషన్ ఏడుకొండలు ’’ ప్రారంభించారు. ఆయన కృషిని ఈ మధ్యే ఎక్సైజ్‌శాఖ కూడా గుర్తించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఏడుకొండలును సన్మానించి, క్యాష్ అవార్డుతో సత్కరించారు.
నాన్నే నాకు ఇన్స్పిరేషన్
‘‘పేద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే కొన్ని తరాల పేదరికాన్ని తుంచి వేసినట్లు అవుతుంది. అందుకే ఈ మిషన్‌ను స్టార్ట్ చేశా. ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్. మా నాన్న చుట్టుపక్కల వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసేవారు. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడితే.. హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయించేవారు. ఆ సేవా భావం నన్ను ఎంతో ఆకట్టుకుంది. నా లక్ష్య సాధనలో నా సతీమణి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది. నా డిపార్ట్‌మెంట్ నన్ను గుర్తించడం, డైరెక్టర్ కమలహాసన్ గారి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మిషన్‌ను 2015లో స్టార్ట్ చేసినప్పటికీ 2019లో వీ6 వాళ్లు టెలికాస్ట్ చేసిన వీడియో, వెలుగులో ప్రచురించిన వార్త నాకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చాయి” అంటున్నారు ఏడుకొండలు.
కోచింగ్ ఇలా..
ఏడుకొండలు ఆన్లైన్, యూట్యూబ్, వీడియో కాన్ఫరెన్స్, జూమ్ మీటింగ్ ద్వారా కోచింగ్ ఇస్తున్నారు. దశాబ్ద కాలంగా ఒకవైపు కోచింగ్ ఇస్తూనే మరోవైపు లైఫ్ స్టయిల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బ్లడ్ డొనేషన్స్ లాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రానివాళ్లు ఆత్మహత్యలకు పాల్పడకుండా.. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కౌన్సెలింగ్స్ ఇస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి భవిష్యత్తు మీద అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. క్రీడలపై అసక్తి ఉన్న స్టూడెంట్స్‌కి కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఒక్కరే 13 సబ్జెక్టుల క్లాస్‌లు చెప్తున్నారు. ఆయన సేవలకుగాను 2022లో నవ నక్షత్ర అవార్డు దక్కింది. 2025 ఫిబ్రవరి 5న కర్ణాటకలో భారతీయ సాంస్కృతిక వికాస సంస్థ నుంచి నేషనల్ అచీవర్స్ అవార్డు కూడా అందుకున్నారు.
మోరల్ వ్యాల్యూస్ నేర్పిస్తారు
నేను నారాయణ పేట జిల్లాలో సీడీఎమ్ఏ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. నేను జాబ్ సాధించడంలో నా ఫ్యామిలీతోపాటు ఏడుకొండలు సార్ సపోర్ట్ చాలా ఉంది. పోటీ పరీక్షలు రాయడానికి ముందు మూడు నెలలు సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నా. సార్ మాకు లైఫ్ స్కిల్స్, మోరల్ వ్యాల్యూస్ కూడా నేర్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ బ్యాలెన్సింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్, డీలింగ్ విత్ ఫెయిల్యూర్స్ వంటి స్పెషల్ స్కిల్స్ నేర్పడం నాకు చాలా నచ్చింది. ప్రిపరేషన్లో మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. అన్ని సబ్జెక్ట్‌లు ఈజీగా అర్థమయ్యేలా నేర్పిస్తారు. ప్రస్తుతం అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూనే... ‘మిషన్’ ప్రోత్సాహంతో ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నా. - వరలక్ష్మి
ప్రైవేటు ఉద్యోగం చేస్తూ..
మాది నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం గ్రామం. మా తల్లిదండ్రులకి నలుగురు పిల్లలం. ఆర్థిక సమస్యల వల్ల మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్, కాలేజీల్లోనే చదివించారు. పోటీ పరీక్షల కోసం ప్రైవేటు కోచింగ్‌లకు పంపించే పరిస్థితి లేదు. చిన్నప్పటినుంచి చదువులో ముందుండే నాకు పోటీ పరీక్షల ప్రిపరేషన్ చాలా కష్టంగా మారింది. చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవుతున్న టైంలో ఏడుకొండలు సార్ నాగర్‌కర్నూల్‌కు వచ్చి ‘మిషన్’ ప్రారంభించారు. నేను అందులో చేరి 2020లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించా. ఆ తర్వాత కూడా ఆన్లైన్లో ఏడుకొండలు సార్ క్లాసులు రెగ్యులర్‌గా వింటూ మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2023లో స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మాసిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం వనపర్తి జిల్లా రేవల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నా. ఒక నిస్సహాయ స్థితిలో నా జర్నీ మొదలైంది. ఇప్పుడు ఏడుకొండలు సార్ మోటివేషన్ వల్ల రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలిగా. సార్‌కు ధన్యవాదాలు.
ఎ. కృష్ణ, ఫార్మసిస్ట్, ప్రభుత్వ ఆసుపత్రి, రేవల్లి, వనపర్తి జిల్లా.
సార్ మాటలు స్ఫూర్తినిచ్చాయి
నేను 2020లో గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సార్ పరిచయం అయ్యారు. మరుసటి రోజు నుంచి నేను కుడా సార్ చెప్పే క్లాస్‌లకు వెళ్లా. అప్పుడే సార్ నాకు ‘‘ఈ ‘మిషన్’.. ప్రిపరేషన్ కోసమే కాదు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ మానవతా విలువలను పెంపొందించేందుకు చేసే ప్రయత్నమే” అని చెప్పారు. నేను జాబ్ సాధించడానికి సార్ మోటివేషన్ ఎంతగానో ఉపయోగపడింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. పేదవాడు ఉన్నతంగా బతకాలంటే చదువు ఒక్కటే మార్గమని సార్ చెప్పిన మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
ఆంజనేయులు, లక్ష్మీపూర్, నాగర్ కర్నూల్ జిల్లా
స్థోమత లేక..
2017లో ‘మిషన్’ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారనే వార్త పేపర్లో చూశా. హైదరాబాద్‌కి వెళ్లి ఫీజు కట్టి కోచింగ్‌కి వెళ్ళే స్థోమత లేక ‘మిషన్’లో కోచింగ్‌కి వెళ్ళా. ఏడుకొండలు సార్ ఒక్కరే అన్ని సబ్జెక్టులు అర్థం అయ్యేవిధంగా చెప్పారు.
అంతేకాదు జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలు చెప్తుంటారు. ఈ ప్రయాణంలో ఏడుకొండలు సార్ దగ్గర విలువలతో కూడిన విద్య నేర్చుకున్నా. 2022లో వచ్చిన పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్లో ఓపెన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. మరొకరికి సాయం చేయాలనే ఆలోచనతో కృషి చేస్తున్న ఏడుకొండలు సార్ ఆశయంలో నా వంతు సాయాన్ని అందిస్తున్నా.
సురేష్, కొల్లాపూర్, ఏఆర్ కానిస్టేబుల్