త్వరలో మిషన్ హైదరాబాద్

త్వరలో మిషన్ హైదరాబాద్

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తం

ఏటా 10 వేల కోట్ల చొప్పున 50 వేల కోట్లు ఖర్చు చేస్తం

జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు ప్రతిపాదన ఉంది

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్​ ప్లాన్లు

పట్టణ ప్రగతి కొనసాగుతుంది

వచ్చే నెల రెండో తేదీ నుంచి బీ పాస్ అమలు

ఫార్మాసిటీని అడ్డుకునే ప్రయత్నాలు వద్దు

అసెంబ్లీలో మంత్రి సమాధానం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ​అభివృద్ధి కోసం మిషన్​ హైదరాబాద్​ కార్యక్రమాన్ని  చేపడతామని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని.. అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తామని తెలిపారు. బడ్జెట్లో మున్సిపల్ శాఖకు రూ.12 వేల కోట్లు కేటాయించారని, ప్రతి మున్సిపాలిటీలో వసతులపై 42 అంశాలతో చార్ట్ రూపొందించామని వెల్లడించారు. ఆదివారం ఐటీ, మున్సిపల్, పరిశ్రమల బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్ లోని 40 ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్  ఏర్పాటు కోసం త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.  ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తామని, ప్రజా రవాణాను బలోపేతం చేస్తామని చెప్పారు. సీవరేజ్ వ్యవస్థ కోసం కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని, ప్రజలు సహకరిస్తే దానిని విజయవంతంగా అమలు చేయొచ్చని తెలిపారు. జీహెచ్ఎంసీలో జనాభా పెరిగిన కారణంగా వార్డుల పెంపు ప్రతిపాదన ఉందన్నారు.

అన్ని మున్సిపాలిటీలు బడ్జెట్లో 10 శాతం నిధులను గ్రీనరీకి, మూడో వంతు నిధులను విలీన ప్రాంతాల అభివృద్ధికి కచ్చితంగా కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భవన నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే నెల 2 నుంచి బీపాస్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి కొనసాగుతుందన్నారు. టీఎస్ ఐపాస్ విజయవంతమైందని, నీతి ఆయోగ్ దానిని ఇతర రాష్ట్రాలకు సిఫార్సు చేసిందని చెప్పారు.

నీటి సమస్య తప్పించినం

గతంలో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉండేదని, ఇప్పుడు ఇబ్బంది తప్పిందని కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా మిషన్ భగీరథ అమలు చేశామని, లోటుపాట్లు ఉంటే సరిచేస్తామని తెలిపారు. అర్బన్ మిషన్ భగీరథ కింద 800 కోట్లతో 38 పట్టణాల్లో నీటి వసతి కల్పిస్తామని, వచ్చే మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఐటీ అభివృద్ధి వేగం పెరిగింది

రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని కేటీఆర్​ అన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం 16 .89 శాతం వృద్ధి సాధించిందని, దేశ సగటు 8.9 శాతమేనని తెలిపారు. గత ఏడాది ఐటీ వృద్ధిలో బెంగళూరును కూడా దాటేశామన్నారు. ఐటీ రంగం వల్ల 20 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. త్వరలో ఐదు జిల్లాల్లో ఐటీ టవర్ల ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. పాత జిల్లా కేంద్రాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ బీపీవోల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

ఫార్మాసిటీపై అనుమానాలొద్దు

ఫార్మా సిటీని ఆపాలని ఓ ఎంపీ కేంద్రాన్ని కోరారని, అన్ని అనుమతులు వచ్చాక ఇలా చేయడం బాధాకరమని మంత్రి కేటీఆర్  అన్నారు. కొందరు నేతలు ప్రజలను రెచ్చగొట్టి, ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీపై ఏ అనుమానాలున్నా తీర్చటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఫార్మా సిటీతో ఐదు లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగాల విషయంలో కొంత అన్యాయం జరుగుతోందని, కంపెనీలను ఆదేశిస్తున్నా అమలు కావటం లేదని కేటీఆర్  చెప్పారు. ఈ విషయంగా తగిన చర్యలు తీసుకుంటామని, త్వరలో చట్టం చేస్తామని వెల్లడించారు.

For More News..

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు