
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయలో భాగంగా కోట్లు ఖర్చు చేసి చెరువులకు మరమ్మతులు చేసినా ఒక్క ఎకరానికి సాగునీరు అందడం లేదు. చెరువుల్లో పూడికలు తీసి, కాలువలు తవ్వించి నీళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అమలు కావడం లేదు. చెరువుల నుంచి చుక్క నీరు అందించిన దాఖలాలు లేవని జిల్లాలోని రైతులు వాపోతున్నారు.
చెరువుల మరమ్మతులకు దాదాపు రూ. 48 కోట్ల ఖర్చు..
ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ స్కీమ్ లో ఫేస్ 1, 2, 3 ద్వారా 164 పనులకు గాను రూ.48. 67 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో 15,809 ఎకరాలు సాగు చేసేలా చెరువులను మిషన్ కాకతీయలో బాగు చేయాలి. నిధుల్లో దాదాపు చెరువుల పూడిక తీతకు రూ. 40. 84 కోట్లు ఖర్చు చేశారు. సాగు నీరు అందించేందుకు రూ. కోట్లు ఖర్చు చేసినా ఆయకట్టు రైతుల భూములు బీడుగానే ఉంటున్నాయి. ఈ స్కీమ్ కింద చేపట్టిన ఏ ఒక్క చెరువు నుంచి రైతులకు ప్రయోజనం కలగడం లేదు. చెరువుల్లో ఎక్కువ నీళ్లు నిల్వ చేసేందుకు పూడిక తీసి ,లోతుగా తవ్వించడంతో పాటు కాలువలను తవ్వించి సైడ్ వాల్ కట్టడానికి ప్లాన్ చేశారు.
కొన్ని చెరువుల్లో నామమాత్రంగా పూడిక తీసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. మరి కొన్ని చెరువులకు కాలువలు తవ్వకుండా ఉన్న కాలువలకే సైడ్ వాల్ కట్టారు. ఈ చెరువుల్లో ఉన్న తూములు ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో చెరువు నుంచి నీళ్లు కాలువలకు పారే పరిస్థితి కనిపించడం లేదు. చెరువులను లోతుగా తవ్వకపోవడం వల్ల రబీ సీజన్ ప్రారంభంలోనే అడుగంటి పోతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందక భూములు పడావుగా ఉంటున్నాయి.
జైనూర్ లేండిగూడ గ్రామంలోని ఇది పరిస్థితి...
రూ. 8.68 లక్షలతో మిషన్ కాకతీయ పథకంలో మూడో విడతలో నిధులు కేటాయించి చెరువులో పూడిక తీయించారు. పనులు చేసి మూడేళ్లు గడిచాయి. కానీ లెండిగూడా చెరువు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎకరం భూమికి కూడా రబీ లో సాగునీరు అందించలేదు. ఆయకట్టు భూములు బీళ్లుగానే ఉన్నాయి. చెరువులో నుంచి మట్టి తవ్వలేదు. చెరువుకట్టను కూడా సరిచేయలేదు. కట్ట చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి.
కాలువను లెవెల్ చేస్తా
కాలువలకు నీరు వస్తలేదు. ఉన్న భూమి వేస్ట్ అయింది. ట్రాక్టర్ పెట్టి కాలువలు లెవెల్ చేస్తా. నీరు అందించని కాలువ నాకెందుకు. ఉన్న కొంత భూమైనా సాగు చేస్తా. రబీ పంట పండకపోయిన వర్షధార పంటలైన పండిస్తా. కోట్లు ఖర్చు చేసిన ఒక్క ఎకరానికి కూడా మిషన్ కాకతీయ చెరువు నీళ్లు రాలే.నీళ్లు
వచ్చేలా చర్యలు తీసుకోవాలే. -
సిడాం రాము , రైతు , లేండిగూడ, జైనూర్
ప్రపోజల్స్ పంపిన
మిషన్ కాకతీయ స్కీమ్ కింద చేపట్టిన చెరువులకు మరమ్మతులు చేసేందుకు గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపిన. గవర్నమెంట్ ఫండ్స్ రాగానే మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటం.
- గుణవంత్ రావు , ఇరిగేషన్ ఈఈ , ఆసిఫాబాద్
కాల్వలు సక్కగ లేక నీళ్లు వస్తలేవు
నాకు దహెగాం పెద్ద చెరువు కింద 2 ఎకరాల పొలం ఉంది. వాన నీళ్లే దిక్కు. చెరువు కింద పొలమున్నది. రెండు పంటలు పండుతాయనుకున్న. కానీ వానాకాలమే నీళ్లు సక్కగా రావు. రెండో పంటకు అసలే రావు. చెరువు నిండా పిచ్చి మొక్కలు మొలిచినయ్. యాసంగి పంట వెయ్యక బీడు విడిచిపెడుతున్న. పూడిక తీపిచ్చి కాల్వలు తవ్వితే నీళ్లు రెండు పంటలకు అందుతయి.
-నికాడి లచ్చన్న, రైతు, దహెగాం