గంజాయి నిర్మూలనకు మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌

  • నల్గొండ జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌‌‌‌ జాయింట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌
  • గంజాయి వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు
  • 150 మందికి రీహబిలిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌
  • ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో సోషల్​ మీడియాలో విస్తృత ప్రచారం

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు ఎస్పీ పి.శరత్‌‌‌‌చంద్రపవార్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌ సి. నారాయణరెడ్డి జాయింట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ చేపట్టారు. గంజాయికి బానిసలుగా మారుతున్న యువతను వ్యసనానికి దూరం చేసేందుకు ‘మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌’, ‘నేను గంజాయి వాడను’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

150 మంది యువకులకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

ఏపీ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, ఒడిశాతో పాటు హైదరాబాద్‌‌‌‌ నుంచి నల్గొండకు గంజాయి సప్లై అవుతోంది. గంజాయి రవాణాని కంట్రోల్‌‌‌‌ చేసేందుకు పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టారు. కానీ అసలు గంజాయి వాడకాన్ని తగ్గిస్తే సప్లై దానంతట అదే కంట్రోల్‌‌‌‌ అవుతుందని భావించిన ఎస్పీ శరత్‌‌‌‌ చంద్ర పవార్‌‌‌‌ మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలో గంజాయికి బానిసలుగా మారిన 150 మంది యువకులను గుర్తించారు.

వారిని నల్గొండలో ఏర్పాటు చేసిన రీహబిలిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు తరలించి సైకియాట్రిస్ట్‌‌‌‌తో పాటు ఇతర డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని రోజులుగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. ఈ సందర్భంగా గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబ సభ్యులపైన దాని ప్రభావం గురించి యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. యువకుల తల్లిదండ్రుల సంరక్షణలోనే ఈ కార్యక్రమమంతా నిర్వహిస్తున్నారు. 150 మంది యువకులకు ఇటీవల అవగాహన కార్యక్రమం పూర్తి కావడంతో వారికి మళ్లీ టెస్ట్‌‌‌‌ చేయగా ఒక్కరికి కూడా గంజాయి పాజిటివ్‌‌‌‌ లక్షణాలు కనిపించలేదు. దీంతో మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌ కార్యక్రమంలో తొలి విజయం నమోదు అయినట్లేనని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. యువకులు మరోసారి గంజాయి వాడినట్టు తేలితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

‘నేను గంజాయి వాడను’ అనే నినాదం

ఎస్పీ ఆధ్వర్యంలో మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌ కార్యక్రమం కొనసాగుతుండగా, కలెక్టర్‌‌‌‌ నారాయణరెడ్డి ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ, కలెక్టర్‌‌‌‌ జాయింట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలతో ప్రజలకు, యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖ, అగ్రికల్చర్‌‌‌‌, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

సోషల్‌‌‌‌ మీడియా వేదికగా అన్ని రకాలుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నేను గంజాయి వాడను అనే డీపీని క్రియేట్‌‌‌‌ చేసి ఎస్పీ, కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల ఫొటోలు, టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌ 87126 70266 తో లోగోలను తయారు చేశారు. యూట్యూబ్‌‌‌‌, ట్విట్టర్, ఇన్‌‌‌‌స్ట్రాగ్రామ్‌‌‌‌ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1.41 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు దగ్ధం చేయడం గమనార్హం. నాగార్జునసాగర్‌‌‌‌ పరిధిలోని విజయపురి పీఎస్, కేతేపల్లి పీఎస్‌‌‌‌లో సుమారు 565 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.