- టోర్నడో, తుఫాను ఎఫెక్ట్..
- 25కు చేరిన మృతుల సంఖ్య
- ఇండ్లు, వాహనాలు ధ్వంసం
- ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రెసిడెంట్ బైడెన్
వాషింగ్టన్: టోర్నడో, తుఫాను ధాటికి మిసిసిపి అతలాకుతలమైంది. శుక్రవారం సంభవించిన ఈ విపత్తు ధాటికి మిసిసిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ చనిపోయిన వాళ్ల సంఖ్య 25కు చేరింది. వందల మంది గాయపడ్డారు. గంటకు 265 నుంచి 320 కిలోమీటర్ల మధ్య గాలులు వీచాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు పట్టణాల్లోని ఇండ్లు, వాహనాలను టోర్నడో చెల్లాచెదురు చేసింది. రోలింగ్ ఫోర్క్ పట్టణంలో ఇండ్లన్నీ ధ్వంసమయ్యాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇండ్ల శిథిలాలు కనిపించాయి. ఆదివారం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. వందల మంది శిథిలాల్లో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు.
టోర్నడో ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న మిసిసిపిలో ప్రెసిడెంట్ బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు.రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(ఫెమా) అడ్మినిస్ట్రేటర్ డిఅన్నె క్రిస్ వెల్ పర్యటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటించలేదు. దీంతో ఫెమా కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఇండ్లు కోల్పోయిన వారికి, వాహనాలు దెబ్బతిన్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు ఫెడరల్ ఫండ్స్ వాడతామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కాగా, టోర్నడో, తుఫాను ధాటికి ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారు ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని మిసిసిపి గవర్నర్ టేట్ రీవ్స్ హామీ ఇచ్చారు.