ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

ఇంటర్​ ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ క్వశ్చన్​పేపర్లలో తప్పులే తప్పులు
ఎగ్జామ్‌‌ రాసే టైంలో దిద్దుబాటు మెసేజ్‌‌లు 
అప్పటికే జవాబులు రాసేసిన స్టూడెంట్లు బేజారు

హైదరాబాద్, వెలుగుఇంటర్‌‌ పరీక్ష పేపర్లు ఈసారి తప్పుల తడకగా వచ్చాయి. బోర్డు నిర్లక్ష్యం పేపర్లలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ తేడా లేకుండా ప్రతి క్వశ్చన్‌‌ పేపర్లోనూ మిస్టేక్స్‌‌ కనబడ్డాయి. అక్షరాల్లో తప్పులు, ఒక పదానికి బదులు ఇంకో పదం అచ్చవడం, వాక్య నిర్మాణాల్లో లోపాలతో స్టూడెంట్లు బేజారయ్యారు. ఎగ్జామ్‌‌ రాసే టైమ్‌‌లో దిద్దుబాటు మెసేజ్‌‌లు వచ్చినా అప్పటికే కొందరు జవాబులు రాసేయడం, టైమ్‌‌ తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడ్డారు.  ఈ నెల 4 నుంచి ఇంటర్‌‌ పరీక్షలు మొదలయ్యాయి. ఫస్టియర్‌‌ వాళ్లు 4,80,531 మంది, సెకండియర్  స్టూడెంట్లు 4,85,345 మంది పరీక్షకు హాజరయ్యారు.

చూడకపోయినా.. లేటైనా..

ఇంటర్‌‌ క్వశ్చన్ పేపర్ల తయారీ కాన్ఫిడెన్షియల్‌‌గా జరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్‌‌లలోనే పేపర్ల తయారీపై వర్క్‌‌షాప్ నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లోని సీనియర్ ఫ్యాకల్టీతో 12 సెట్ల క్వశ్చన్ పేపర్లు తయారు చేయిస్తారు. వాటిల్లో 3 సెట్లను ప్రింట్ చేయిస్తారని సమాచారం. ఎవరు, ఎక్కడ తయారు చేశారు? ఎక్కడ ప్రింటింగ్ చేశారు? కాన్ఫిడెన్షియల్. 3 సెట్లలో ఏది ఎగ్జామ్‌‌ పేపరో పరీక్ష నాడు పొద్దున 6 గంటలకు అధికారులు ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఉదయం 8.45 గంటలకు అన్ని సెంటర్లలో అధికారికంగా పేపర్ సీల్ ఓపెన్ చేస్తారు. అదే టైమ్‌‌లో స్టేట్ ఆఫీస్‌‌లో సబ్జెక్ట్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ మరోసారి పేపర్‌‌ను పరిశీలిస్తారు. తప్పులుంటే అప్పటికప్పుడు అన్ని జిల్లాల డీఐఈఓలకు, చీఫ్ సూపరింటెండెంట్లకు సమాచారమిస్తారు. అన్ని సెంటర్లకు మెసేజ్ పెడతారు. మెసేజ్ చూడకపోయినా, ఆలస్యం జరిగినా నష్టపోయేది స్టూడెంట్సే.

ఇప్పటివరకూ జరిగిన ప్రతి క్వశ్చన్‌ పేపర్లోనూ తప్పులొచ్చాయి. కొన్ని చిన్న తప్పులైతే, ఇంకొన్ని ప్రశ్న అర్థాన్నే మార్చేశాయి. ఈసారి ఇంగ్లిష్ పేపర్–2తో ఎక్కువ తప్పులొచ్చాయి. మంగళవారం జరిగిన ఫస్టియర్ కామర్స్ పేపర్‌‌లోనూ చాలా తప్పులొచ్చాయి. ఇంగ్లిష్ –2 పేపర్‌‌లో 14వ ప్రశ్నను అటెంప్ట్‌‌ చేసిన వాళ్లకు 4 మార్కులు కలపాలనుకుంటున్నట్టు బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ చెప్పారు. అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.

ప్రతి పేపర్‌‌కు ఎరాటా!

పరీక్షా కేంద్రాల్లో ఎవరి దగ్గరా ఫోన్లు ఉండొద్దని ఆదేశాలున్నాయి. అయితే ఎగ్జామ్‌‌ టైంలో ఒకసారి ఎరాటా మెసేజ్‌‌లు చూడటానికి చీఫ్‌‌ సూపరింటెండెంట్‌‌కు అవకాశం ఉంది. ఆ మెసేజ్‌‌ను చూసి దిద్దుబాట్లేమైనా ఉంటే స్టూడెంట్స్‌‌కు చెప్పాలి. కానీ కొన్ని సార్లు 11గంటల తర్వాత కూడా మెసేజ్‌‌లు వచ్చాయి. కానీ తప్పులున్న ప్రశ్నలు అర్థంకాక స్టూడెంట్లు అప్పటికే సతమతమైపోయారు. ఈ నెల 10న ప్రశ్నాప్రతాల్లో తప్పుల్లేవని ప్రకటించిన​ బోర్డు అధికారులు.. ఉర్దూ మీడియం జువాలజీ- పేపర్1​లో తప్పులున్నాయని అరగంటకొకటి, గంటకొకటి రెండు మెసేజ్‌‌లు పంపారు. మంగళవారం కామర్స్ పేపర్‌‌లో తప్పులకు సంబంధించి 11.06కు మెసేజ్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనట్టు ఈసారి ప్రతి పేపర్‌‌లోనూ తప్పులున్నాయని, బోర్డు నుంచి రోజూ ఎరాటా మెసేజ్‌‌లు వచ్చాయని ఇన్విజిలేటర్లు చెప్పారు.

క్వశ్చన్ పేపర్లలో తప్పులివే..

5వ తేదీన

సంస్కృతం సెకండియర్ పేపర్‌‌లో 13వ ప్రశ్నలో బిట్​నెంబర్ 1లో హారిస్‌‌కు బదులు హరిసా అని పడింది. 15వ క్వశ్చన్‌‌లో బిట్ నెంబర్ 1లో యథాశక్తికి బదులు యసశక్తి అని వచ్చింది.

7వ తేదీన

సెకండియర్ ఇంగ్లిష్​ పేపర్ -2లో 5వ ప్రశ్నలో బిట్ నెంబర్ ఏలో  WHY బదులు WHAT అని వచ్చింది. 7వ ప్రశ్నలోని పేరా2లో DISCIPLINE కు బదులుగా DISIPLINE  అని,12వ క్వశ్చన్ లో TURN A DEAF EAR బదులు TURN TO DEAF YEAR అని పడింది. 17వ ప్రశ్నలో  FELICITATION బదులుగా FELICILATION అని వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 14  కూడా బ్యాంక్​ వివరాలు లేకుండానే బ్యాంకు వివరాలివ్వాలని ప్రశ్నను అసంపూర్తిగా ఇచ్చారు. 10వ ప్రశ్న బిట్ నెంబర్ 1 కూడా తప్పుగా వచ్చింది.

10వ తేదీ

ఎలాంటి తప్పుల్లేవని ఉదయం 9.55 నిమిషాలకు అధికారులు ప్రకటించారు. మళ్లీ ఉదయం 10.18 నిమిషాలకు ఫస్టియర్ బాటనీ -1 ఉర్దూ మీడియంలోని 6వ ప్రశ్నలో మాష్మియాట్‌‌కు బదులు షామియాట్ అని వచ్చిందని మెసేజ్ పెట్టారు. ఉదయం 10.42 నిమిషాలకు 13వ ప్రశ్నలో సన్ఫీకి బదులు మన్ఫీ అని వచ్చిందని పంపారు.

11వ తేదీ

సెకండియర్ బాటనీ ఉర్దూ మీడియం పేపర్లో 2వ ప్రశ్నలో షరీక్ ఆమీల్‌‌కు బదులు షరీక్ మిల్ అని వచ్చింది.13వ ప్రశ్నలో జాడ్ కరీచికి బదులు జాడ్ కార్తీచి అని ఉంది.

13వ తేదీ

సెకండియర్ హిస్టరీ తెలుగు మీడియం పేపర్లో 8వ ప్రశ్నలో కుతుబ్​షాషీ పేరుకు బదులు తుక్కుబ్ షాహీ అని వచ్చింది. హిస్టరీ ఉర్దూ మీడియంలో 33వ ప్రశ్నలో షరీఫానాకు బదులు ముష్రిఫానా అని వచ్చింది.

14వ తేదీ

ఫస్టియర్ ఎకనామిక్స్ తెలుగుమీడియంలో 4,15 ప్రశ్నల్లో జాతీయ ఆదాయానికి బదులు జాతీయదన్ని అని పడింది. 23వ ప్రశ్నలో వెబ్లిన్‌‌కు బదులు వెబ్లెన్ అని ఉంది.

ఎకనామిక్స్ ఉర్దూ మీడియం(ఓల్డ్) 8వ ప్రశ్నలో ముతానియత్‌‌కు బదులు ముస్తాన్నియత్ అని, 13వ ప్రశ్నలో ‘బార్డర్ నిజాం కియాహై’ కి బదులు బజార్‌‌కి దర్జా బండికి వాజహత్ కిజియే అని పడింది.

16వ తేదీ

సెకండియర్ ఫిజిక్స్ తెలుగు మీడియం పేపర్‌‌లో 2వ ప్రశ్నలో అనిశ్చితత్వకు బదులు అనిచ్చితత్వ సూత్రం అని వచ్చింది.

17వ తేదీ

ఫస్టియర్ కెమిస్ర్టీ తెలుగు మీడియంలో 15వ ,16వ ప్రశ్నల్లో, ఇంగ్లిష్​మీడియంలో 14వ ప్రశ్నలో తప్పులొచ్చాయి. కామర్స్ పేపర్‌‌లో (న్యూ)  ఇంగ్లిష్ మీడియంలో 27వ ప్రశ్న, తెలుగు మీడియంలో 16వ ప్రశ్నలో తప్పులు దొర్లాయి. కామర్స్​ (ఓల్డ్) తెలుగు మీడియంలో 18, 19, 22, 23, 31వ ప్రశ్నల్లో తప్పులొచ్చాయి.