ప్రాణాలు తీస్తున్న భూతగాదాలు..!

ప్రాణాలు తీస్తున్న భూతగాదాలు..!
  • ధరణి లోపాలు, అక్రమార్కుల తీరుతో వివాదాలు
  • ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న  బాధితులు
  • న్యాయం దొరక్క ఆత్మహత్యలు

హనుమకొండ, వెలుగు : ధరణి లోపాలు, ఆఫీసర్ల తప్పిదాలు, అక్రమార్కుల పాపాల వల్ల క్షేత్రస్థాయిలో భూతగాదాలు పెరిగిపోతున్నాయి. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములు ధరణి వల్ల ఇతరుల పేరుకు మారడం, అక్రమార్కులు ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని పట్టా చేసుకోవడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, న్యాయం దొరక్కపోవడంతో అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. 

భూమి ఒకరిది.. పేరు మరొకరిది..

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూసమస్యలు తీవ్రమయ్యాయి. గతంలో అమ్ముకున్న భూములకు కూడా పాత ఓనర్ల పేర్లే రావడం, కొంతమంది పేర్ల మీద భూమి ఎక్కకపోవడం, భూములకు ఇతరుల పేర్లు చూపిస్తుండటంతో గ్రామాల్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. బాధితులంతా ఎమ్మార్వోలు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా భూసమస్యలకు సంబంధించి ఫిర్యాదులు ఆఫీసర్లకు అందగా, ఇప్పటికీ అవి సాల్వ్ కాకపోవడంతో ఎంతోమంది ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ధరణి లోపాలతో పేర్లు మారడం వల్ల కొంతమంది రియల్టర్లు, పొలిటికల్ లీడర్లు పంచాయితీల పేరున భూదందాలు మొదలుపెట్టగా, న్యాయం కోసం స్టేషన్లు, కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా హసన్ పర్తి మండలం అన్నసాగర్​లో ఇదే జరిగింది. తండ్రి నుంచి తనకు రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని తన తమ్ముడే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బండ మహేందర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గత శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు డెడ్ బాడీ నిందితుడి ఇంటి ఎదుటే ఉంచి నిరసన చేపట్టగా, పోలీసు అధికారులు కలుగజేసుకుని కాంప్రమైజ్ చేశారు. 

ఆత్మహత్యల కలకలం..

భూవివాదాల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో ఆత్మహత్యలు, సూసైడ్ అటెంప్ట్స్ క లకలం రేపుతున్నాయి. అన్నసాగర్ బండ మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా, 15 రోజుల్లో జనగామ కలెక్టరేట్ లోనే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతికి సంబంధించిన భూమిని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయగా పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ నెల 1న కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అదే జిల్లా పసరమడ్లకు చెందిన నర్సింగారావుకు చెందిన భూమిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఇదివరకు రెండు సార్లు, జూన్ 24న మరోసారి కలెక్టరేట్ లో పెట్రోల్​ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎల్కతుర్తి మండలం సూరారానికి చెందని ఎర్రబెల్లి రాజేశ్వరరావు తన భూమిని తనకు దక్కకుండా చేస్తున్నారనే కారణంతో ఫిబ్రవరి 13న ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్​జిల్లా రాయపర్తి మండలం బురహన్​పల్లిలో సోమవారం తాజా మాజీ సర్పంచ్ దేవేందర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కూడా భూవివాదమే కారణమనే ప్రచారం జరుగుతోంది.

ఇలా భూవివాదాలు, తగాదాలు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తుండగా, కొంతమంది పోలీస్ అధికారులు సెటిల్​మెంట్ల పేరున దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని భూవివాదాలకు తగిన పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెరుగుతున్న ఫిర్యాదులు..

అన్నసాగర్ కు చెందిన ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన రూ.కోట్లు విలువ చేసిన భూమి ధరణిలో ఇతరుల పేరున చూపిస్తోంది. ఆరా తీయగా, కొంతమంది ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలింది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు హసన్ పర్తి స్టేషన్ లో కేసు నమోదైంది. వరంగల్ రింగ్​ రోడ్డు చుట్టూరా ఉన్న భూములు చాలాచోట్ల ధరణిలో పాత ఓనర్ల పేరునే చూపిస్తుండగా, వాటిపై వివాదాలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండలో వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు అధికారులు అక్రమంగా తనకు రావాల్సిన భూమిని

తన తమ్ముడికి పట్టా చేశారని రాజేశ్వర్ రావు అనే వ్యక్తి సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆరెపల్లికి చెందిన అమర్ నాథ్ ది కూడా ఇదే సమస్య. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో అన్నదమ్ములకు సంబంధించిన భూమి ధరణిలో ఇతరుల పేరున చూపిస్తోంది. అసలు ఓనర్లు తమ పేరున పట్టా చేయాల్సిందిగా కోరినా, చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.