హిమాలయాల్లో ఇంకా ఉందని నమ్మే యతి నుంచి నాగబంధం వరకు అంతుచిక్కని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి ఇండియాలో.అలాంటిదే ఈ తొమ్మిది మంది సొసైటీ కూడా. అశోక చక్రవర్తి ఈ సొసైటీకి అంకురం చేశారని చాలామంది నమ్ముతారు. అయితే.. ‘ఈ సొసైటీ ఇప్పటికీ ఉంది. అందులో తొమ్మిది మంది మేధావులు కూడా ఉన్నార’ని చెప్పుకుంటుంటారు.
ఫ్రీమేసన్స్, ఇల్యుమినాటి లాంటి రహస్య సొసైటీలు ఉన్నాయని ప్రపంచమంతా నమ్ముతోంది. అంతెందుకు రెండో ప్రపంచయుద్ధానికి కూడా ఇల్యుమినాటి సభ్యులే కారణమని నమ్మేవాళ్లూ ఉన్నారు. అయితే.. అలాంటి సీక్రెట్ సొసైటీ ఇండియాలో కూడా ఉందని చాలామంది అనుకుంటారు. ఈ సొసైటీని రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించిన మౌర్య చక్రవర్తి అశోకుడు మొదలుపెట్టాడట! ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. క్రీ. పూ. 270లో అశోకుడు ‘ది నైన్ అన్ నోన్ మెన్’ అనే ప్రైవేట్ సొసైటీని మొదలుపెట్టాడు. ఇందులో ఉండే తొమ్మిది మందిని ‘నవరత్నాలు’ అని పిలుస్తారు.
ఇది ఒక సీక్రెట్ క్లబ్. ఈ క్లబ్ ఇండియాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ పురోగతికి సాయం చేస్తుంటుంది. అశోకుడు ఈ తొమ్మిది మంది గురించి ఎవరికీ తెలియకూడదని, వాళ్ల వివరాలు చాలా రహస్యంగా ఉండాలని చెప్పాడట. అందుకే ఇప్పటికీ ఈ సొసైటీ సభ్యులు ఎవరికీ తెలియకుండా వాళ్ల విధులు నిర్వర్తిస్తుంటారని నమ్ముతారు చాలామంది. ఈ క్లబ్‌లో ఉన్నవాళ్లు ఎంతో రహస్య సమాచారాన్ని దాచి ఉంచారట. అది దుర్మార్గుల చేతిలోకి వెళ్తే మానవాళి ప్రమాదంలో పడుతుంది. అందుకే వాళ్ల గురించి బయటకి తెలియకుండా జాగ్రత్త పడతారట!
అసలు ఎందుకు ఏర్పడింది?
అశోకుడు కళింగపై దండెత్తే వరకు అతడికి ఒక క్రూరమైన నాయకుడిగా పేరు. అతను కళింగ యుద్ధంలో గెలిచినా.. అందులో దాదాపు లక్ష మంది చనిపోయారు. ఆ భారీ ప్రాణనష్టం, భయంకరమైన సన్నివేశాలు అశోకుడిని బౌద్ధం, అహింస వైపు నడిపించాయి. బౌద్ధాన్ని అనుసరించి అశోకుడు తన జీవితాన్ని జ్ఞానం, శాంతి సాధనకు అంకితం చేశాడు. అదే టైంలో ప్రాచీన భారతదేశంలో అపారమైన జ్ఞానం ఉందని తెలుసుకున్నాడు అశోకుడు. అప్పటివరకు అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వాడుకోవడం వల్లే కళింగ యుద్ధంలో లక్ష మంది చనిపోయారని భావించాడు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదని, జ్ఞానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అనుకున్నాడు. కానీ.. ఆ జ్ఞానం దుర్మార్గుల చేతుల్లో పడటం మంచిది కాదని నమ్మాడు.
అలాగే దానిని అవసరమైనప్పుడు వాడుకునేంతవరకు కాపాడుకోవాలని భావించాడు. కాబట్టి జ్ఞానాన్ని, భారతీయ నాగరికతను కాపాడేందుకు ‘నవ రత్నాలు’ అనే సీక్రెట్ టీంని మొదలుపెట్టాడు. ఆ తొమ్మదిమందిలో మైక్రోబయాలజీ, ప్రాపగాండా, కాస్మోలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, ఆల్కెమీ, లైట్, కమ్యూనికేషన్, గ్రావిటీ బాగా తెలిసిన వాళ్లు ఉంటారు. వీళ్లు జ్ఞానాన్ని దాచేందుకే కాదు.. అభివృద్ధి చేసేందుకు కూడా పనిచేస్తుంటారు. వీళ్ల దగ్గర తొమ్మిది పుస్తకాలు ఉంటాయి. కొత్త విషయం కనుగొన్నప్పుడు లేదా పాత టెక్నాలజీని రివైవ్ చేసినప్పుడు ఆ విషయాల్ని వాటిలో రాస్తుంటారు.
ఇండియన్ ఇల్యుమినాటి
సీక్రెట్ సొసైటీలు మనకు కొత్త. కానీ.. విదేశాల్లో కొత్తేమీ కాదు. ప్రపంచంలో ఇల్యుమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఉన్నట్టు చాలామంది చెప్తుంటారు. ఈ సొసైటీ ఐదుగురితో మొదలైంది. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ మనుషులు ఉన్నారు. ఈ సొసైటీలో చేరాలంటే ఆత్మలను అర్పించాలని.. అందుకు బదులుగా జ్ఞానం,
డబ్బు వస్తాయని చెప్తుంటారు. కొందరైతే రెండో ప్రపంచయుద్ధానికి ఈ సొసైటీకి ఏదో లింక్ ఉందని నమ్ముతారు కూడా. మన దగ్గర సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ కూడా ఈ సొసైటీలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. అయితే.. మన దగ్గర ఉన్న ఈ తొమ్మిదిమంది అన్‌నోన్ మెన్ మాత్రం దీనికి కాస్త భిన్నం. ఇందులో ఎప్పటికీ తొమ్మిది మందే ఉంటారు. వాళ్లలో ఎవరైనా చనిపోయినా, సొసైటీ నుంచి తప్పుకున్నా వాళ్ల ప్లేస్‌లో మరొకరిని నియమిస్తారట. అయినా.. దీన్ని అందరూ ‘ఇండియన్ ఇల్యుమినాటి’ అనే పిలుస్తారు.
ఏం చేస్తారు?
అశోక చక్రవర్తి జ్ఞానాన్ని ‘శక్తి’ అని నమ్మేవాడు. ఆ శక్తి అందరి దగ్గర ఉంటే ప్రమాదమని ఇలా.. తొమ్మిది మందికి మాత్రమే పరిమితం చేశాడు. ఆ శక్తిని సంరక్షించడంతో పాటు మరింత జ్ఞానాన్ని సేకరించి, డెవలప్ చేయడం, శాస్త్రీయ సిద్ధాంతాలు, సాంకేతికతలను స్టడీ చేయడం వాళ్లకు అప్పగించిన పనులు. అప్పట్లో ఇండియాలోనే అత్యంత మేధావులను వెతికి, ఈ సొసైటీలో చేర్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో పుస్తకం ఉంటుంది. దానిలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటారు.
బయటికి తీసుకొచ్చిన ముండీ!
టాల్బోట్ ముండీ అనే ఆంగ్ల రచయిత ఈ సొసైటీ మీద ‘ది నైన్ అన్‌నోన్ మెన్’ అనే పుస్తకాన్ని రాశాడు. పుస్తకం రాయడానికి ముందు అతను దీనిపై చాలా రీసెర్చ్ చేశాడు. అశోకుడు స్వయంగా రాసిన ట్రాన్స్‌స్క్రిప్ట్స్ కూడా అతని పరిశోధనలో దొరికాయి. వాటి ఆధారంగానే ఆ తొమ్మిది మంది వ్యక్తుల దగ్గర ఉన్న తొమ్మిది పుస్తకాల లిస్ట్‌ని కూడా తయారుచేశాడు.
జాక్వెస్ బెర్గియర్, లూయిస్ పావెల్స్‌లు ఈ సొసైటీ నిజంగానే ఉందని1960లో చెప్పారు. పోప్ సిల్వెస్టర్–II రాసిన ‘‘ది మార్నింగ్ ఆఫ్ ది మెజీషియన్స్’’లో కూడా దీని ప్రస్తావన ఉంది. సపన్ సక్సేనా రాసిన ‘ఫైండర్స్ కీపర్స్’, క్రిస్టోఫర్ సి. డోయల్ రాసిన ‘మహాభారత రహస్యం’ లో కూడా ఈ సొసైటీ గురించి చర్చించారు.
ఆ తొమ్మిది పుస్తకాలు ఇవే...
ఫిజియాలజీ : ఈ పుస్తకంలో ఒకరిని తాకడం ద్వారా ఎలా హత్య చేయాలో చెప్పారు. దీన్ని ‘‘ది టచ్ ఆఫ్ డెత్” అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ పుస్తకం నుండి లీకయిన సమాచారం వల్లే ‘జూడో’ యుద్ధ కళ పుట్టుకొచ్చిందని చెప్తారు కొందరు.
కమ్యూనికేషన్ : ఈ పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల మీద చేసిన స్టడీ ఉంది. భూసంబంధమైన, గ్రహాంతర జీవులతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ఉంటుంది ఇందులో.
గురుత్వాకర్షణ : ఈ పుస్తకంలో గురుత్వాకర్షణ రహస్యాలు చెప్పారు. అలాగే వేద విమానం గురించి కూడా రాశారు.
మైక్రోబయాలజీ : మైక్రోబయాలజీతో పాటు బయోటెక్నాలజీ గురించి కూడా ఉంది ఈ పుస్తకంలో.
ప్రాపగండ : ఈ పుస్తకం ప్రాపగండ, మానసిక యుద్ధ వ్యూహాలను చర్చిస్తుంది.
విశ్వోద్భవ శాస్త్రం : విశ్వంలోని ఆందోళనలను అధ్యయనం చేసి ఈ పుస్తకంలో రాశారు.
రసవాదం : ఈ పుస్తకం ప్రధానంగా లోహ పరివర్తనకు సంబంధించింది.
కాంతి : ఈ పుస్తకం కాంతి లక్షణాలు, వేగం, దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి వంటి అంశాల గురించి వివరించింది.
సామాజిక శాస్త్రం : ఇది సమాజ పురోగతికి మార్గదర్శకాలను, దాని విధ్వంసాన్ని అంచనా వేసే పద్ధతులను వివరించింది.
* * *
అశోకుడు ఏర్పాటు చేసిన ఈ సొసైటీ గురించి రకరకాల కథలు వినిపిస్తుంటాయి. వాళ్లు ఇప్పటివరకు ఈ ప్రపంచం కోసం ఎన్నో మంచిపనులు చెప్తుంటారు. అలాగే గంగానది స్వచ్ఛంగా ఉండడానికి, ప్లేగు, కలరా వ్యాధులకు మందులు కనిపెట్టడానికి కూడా వీళ్లు సాయం చేశారని నమ్మేవాళ్లూ ఉన్నారు. వాటిలో ఇవి కొన్ని...
మాట్లాడే బొమ్మ
మొదటి ఫ్రెంచ్ పోప్ సిల్వెస్టర్–II ఒక రహస్య యాత్రలో భాగంగా ఇండియాకి వచ్చాడు. ఇక్కడ అతను ఈ తొమ్మిది మందిని కలుసుకున్నాడు. వాళ్ల దగ్గర ఎన్నో ఆశ్చర్యపరిచే శక్తులు ఉన్నాయని తెలుసుకుని, వాటిలో కొన్ని నేర్చుకున్నాడు. వాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానంతోనే అతను మాట్లాడే కంచు తలను ఒకదాన్ని తయారుచేశాడు. అది బైనరీ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే రోబో పుర్రెలా అన్నమాట.
యాంటీ గ్రావిటేషన్ సూత్రాలను ఉపయోగించి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌షిప్‌లను తయారుచేసే విధానం ‘ది నైన్ అన్‌నోన్’ సొసైటీ దగ్గర ఉన్న గ్రంథాల్లో ఉంది. ‘లఘిమా’ సిద్ధి అనేది కూడా దాని ఆధారంగానే పనిచేస్తుంది. దీని గురించి టిబెట్‌లో కొన్ని పుస్తకాలు కనుగొన్నారు.
ప్లేగు, కలరా నయం చేయడానికి
అలెగ్జాండర్ ఎమిలే జీన్ యెర్సిన్ ప్రపంచాన్ని బుబోనిక్ కలరా, ప్లేగు నుండి రక్షించాడని అందరికీ తెలిసిందే. అతను కూడా ఇండియా సొసైటీలోని తొమ్మిది మందిని కలుసుకుని, వాళ్ల దగ్గర్నించే ఇమ్యునోటాక్సిన్‌ను ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడట!
గంగానది స్వచ్ఛత
ఫ్రెంచ్ న్యాయవాది, లెక్చరర్, రచయిత అయిన లూయిస్ జాకోలియోట్ఈ తొమ్మిది మంది ఉన్నారని నమ్మాడు. ‘ప్రతిరోజూ లక్షలాది మంది యాత్రికులు గంగానది జలాల్లో స్నానాలు చేస్తున్నప్పటికీ, ఆ నది కలుషితం కాలేదు. అందుకు కారణం ఆ తొమ్మిది మందేనని నమ్మేవాళ్లు ఉన్నారు. ఆ తొమ్మిది మంది రేడియేషన్ ద్వారా నీటిని క్రిమిరహితం చేసే టెక్నాలజీని కనుగొన్నారు. గంగానదికి నదీగర్భంలో ఒక రహస్య దేవాలయం ఉంది. ఇది రేడియేషన్‌ను ఉత్పత్తి చేసి నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది. మరే నదికి ఇంత అద్భుతమైన శక్తి లేద’ని చెప్పాడట ఆయన.
ఇన్‌ఫ్లుయెన్సింగ్
ది నైన్ అన్నోన్ల దగ్గర ఉన్న ప్రాపగండా బుక్‌లో జనాలను ఎలా కంట్రోల్‌కి తెచ్చుకోవాలి? నాయకుడు చెప్పింది వినేటట్టు ఎలా మార్చాలి? అనేదాని గురించి ఉంది. ఆ సమాచారంతో ప్రపంచంపై ఆధిపత్యం సాధించొచ్చు. అందుకే ప్రపంచాన్ని జయించాలని సంకల్పించిన హిట్లర్ ఈ పుస్తకం కోసం అనేకసార్లు ప్రయత్నించాడని చెప్తుంటారు.1930ల్లో హిట్లర్ ఈ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని సేకరించడానికి టిబెట్, ఇండియాలకు టూరిస్ట్‌ల రూపంలో తన మనుషుల్ని పంపాడట! వాళ్లు కొంత క్లాసిఫైడ్ మెటీరియల్‌ని తీసుకోగలిగారట. అదే జర్మన్‌లను మార్చేందుకు హిట్లర్‌కు ఉపయోగపడిందని చెప్పుకున్నారు అప్పట్లో!