భారత్‌లో విలన్.. ఆస్ట్రేలియాలో హీరో: ఇంతకీ మిచెల్ మార్ష్ ఏం చేశాడు

భారత్‌లో విలన్.. ఆస్ట్రేలియాలో హీరో: ఇంతకీ మిచెల్ మార్ష్ ఏం చేశాడు

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా ఆ జట్టు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి అహంకారం చూపించాడు. మార్ష్ చేసిన ఈ పనికి ఎంత బలుపు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. కనీసం కప్ కు గౌరవం ఇవ్వాలి కదా..  ఇంత బరితెగింపా.. కప్ అంటే ఇంత చులకనా అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే తాజాగా మార్ష్ చేసిన పని అతడిని హీరోగా చేసింది. 

స్వదేశంలో పాకిస్థాన్ తో మూడు టెస్టు మ్యాచ్ ల భాగంగా.. తొలి టెస్టులో నిన్న ఆస్ట్రేలియా (డిసెంబర్ 17) పాకిస్థాన్ ను  360 పరుగుల తేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధ సెంచరీలు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును మార్ష్ యంగ్ ఫ్యాన్ కు ఇచ్చేసాడు. ఆస్ట్రేలియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక పిల్లాడి దగ్గరకు వచ్చి తన మెడల్ ను ఆ పిల్లాడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. 

మార్ష్ చేసిన ఈ గొప్ప పనిని ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. భారత్ లో విమర్శలు ఎదుర్కొన్న ఈ ఆల్ రౌండర్ ఇప్పుడు ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసిన మార్ష్.. రెండో ఇన్నింగ్స్ లో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బంతితో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ను బోల్తా కొట్టించాడు. 

మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో వార్నర్(164) భారీ సెంచరీతో 487 పరుగులు చేసింది. అనంతరం పాక్ 271 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఖవాజా (90), మార్ష్(63) అర్ధ సెంచరీలు చేయడంతో 5 వికెట్లను 233 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే కుప్పకూలింది.  ఈ మ్యాచ్ లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ తీసుకున్న లియాన్ టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్ లోకి చేరాడు.