Mitchell Marsh: లక్నోకి ఊరట.. కేవలం బ్యాటర్‌గానే ఆడతానన్న ఆసీస్ ఆల్ రౌండర్

Mitchell Marsh: లక్నోకి ఊరట.. కేవలం బ్యాటర్‌గానే ఆడతానన్న ఆసీస్ ఆల్ రౌండర్

ఐపీఎల్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ కు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ ఆడతానని కన్ఫర్మ్ చేశాడు. ఈ విషయాన్ని అతను గురువారం (మార్చి 13) ప్రకటించాడు. మార్ష్ వస్తున్నాడని సంతోషించే లోపే లక్నోకు బిగ్ షాక్ షాక్ ఇచ్చాడు. అతను కేవలం బ్యాటర్ గానే కొనసాగుతానని చెప్పడం విశేషం. దీంతో లక్నోకు కాస్త ఉపశమనం కలిగినట్టయింది. 33 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్ లక్నో తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో మార్ష్ ను రూ. 3.4 కోట్లకు లక్నో జట్టు సొంతం చేసుకుంది. 

వెన్నుముక గాయంతో ఇబ్బంది పడుతున్న మార్ష్.. పూర్తిగా కోలుకున్నట్టు సమాచారం. గత మూడు సీజన్ లు గా మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అయితే అతను చాలాసార్లు గాయం కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఢిల్లీ కంటే ముందు మార్ష్ గతంలో ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పూణే వారియర్స్, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.నివేదిక ప్రకారం మార్ష్ మార్చి 18న లక్నో జట్టుతో కలవనున్నాడు. ఈ ఆల్ రౌండర్ తనకు ఎంతగానో తెలిసిన జస్టిన్ లాంగర్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జనవరి 7న బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున మార్ష్ చివరిసారిగా మ్యాచ్ ఆడాడు.

గత కొంతకాలంగా మార్ష్ ఫార్మాట్ ఏదైనా ఘోరంగా విఫలమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  7 ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేసి చివరి టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయాడు. అనుభవం దృష్టిలో పెట్టుకొని ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కినప్పటికీ గాయంతో దూరమవ్వాల్సి వచ్చింది. మార్ష్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సీజన్ లో లక్నో జట్టును టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నడిపించనున్నాడు. మార్చి 24 న ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.