ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి వరల్డ్ కప్ ఫైనల్ మీదే ఉంది. భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న ఈ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. దాదాపు నెలన్నర పాటు అభిమానులకి మంచి కిక్ ఇచ్చిన ఈ మెగా టోర్నీ తుది దశకు చేరుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్ సొంతగడ్డపై ఫైనల్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ కు భారీ హైప్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ జరగడానికి ముందు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ సంచలన కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన మిచెల్ మార్ష్ ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడతాయని జోస్యం చెప్పాడు. మార్ష్ చెప్పినట్లుగానే వరల్డ్ కప్ ఫైనల్ కి ఆస్ట్రేలియాతో పాటు భారత్ ఫైనల్ కు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 450-2 స్కోర్ చేస్తుందని.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ను 65 పరుగులకే ఆలౌట్ చేస్తామని.. ఆస్ట్రేలియా ఈ ఫైనల్లో 385 పరుగుల తేడాతో గెలుస్తుందని చెప్పాడు. అయితే మార్ష్ ఈ కామెంట్స్ సరదాగా చేసినట్టు అర్ధం అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నెటిజన్స్ మార్ష్ ను ఒక ఆట ఆడుకోవడం ఖాయం.
ఈ రెండు జట్ల మధ్య దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా 359 పరుగులు చేస్తే భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అజేయ సెంచరీకి తోడు బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. అయితే ఈ సారి బలంగా కనిపిస్తున్న భారత జట్టును ఆస్ట్రేలియా నిలువరించి విశ్వవిజేతగా నిలవడం కష్టంగానే కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం, ఆడిన 10 మ్యాచ్ ల్లో గెలవడం భారత్ కు కలసి వచ్చే అంశం.