Mitchell Starc: పుట్టిన రోజు అరుదైన రికార్డ్.. 700 వికెట్ల క్లబ్‌లో మిచెల్ స్టార్క్

Mitchell Starc: పుట్టిన రోజు అరుదైన రికార్డ్.. 700 వికెట్ల క్లబ్‌లో మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 35 ఏళ్ల అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా స్టార్క్.. శ్రీలంక ఓపెనర్  దిముత్ కరుణరత్నే వికెట్ తీసుకొని ఈ ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున 700 వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్ మిచెల్ స్టార్క్. అంతకముందు షేన్ వార్న్ (1001), గ్లెన్ మెక్‌గ్రాత్ (949), బ్రెట్ లీ (718) ఈ జాబితాలో స్టార్క్ కంటే ముందున్నారు.

2011 లో న్యూజిలాండ్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన స్టార్క్.. 14 ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు  రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌లో స్టార్క్ 376 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 244, టీ20ల్లో 79 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్న ఆటగాళ్లలో స్టార్క్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ స్టార్క్ కంటే ముందు 700 వికెట్ల ఘనతను అందుకున్నాడు. భారత క్రికెటర్లలో రవీంద్ర జడేజా 597 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.

ALSO READ | Champions Trophy 2025: లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం.. రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడా..?

ఈ మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజ్ లో చండీమల్ (9), కామిందు మెండీస్ (13) ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసింది. ఖవాజా 232 పరుగులు చేయగా.. స్మిత్ 141 పరుగులతో భారీ శతకం బాదాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లిస్ 90 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. తొలి రోజు హెడ్ 57 పరుగులు చేసి రాణించాడు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే, ప్రభాత్ జయసూర్య తలో మూడు వికెట్లు పడగొట్టారు.