Champions Trophy 2025: ఆస్ట్రేలియాకు కష్టకాలం: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్క్ ఔట్

Champions Trophy 2025: ఆస్ట్రేలియాకు కష్టకాలం: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్క్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆ జట్టు దాదాపు అరడజను ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. తాజాగా ఆసీస్ జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి  వైదొలిగాడు. మంగళవారం (ఫిబ్రవరి 11) ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టార్క్ పేరు లేదు. ఇప్పటికే కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజాల్ వుడ్ దూరమైన నేపథ్యంలో స్టార్క్ కూడా లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

మరోవైపు ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినీస్ లేకుండా ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతుంది. ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్లతో పాటు.. ముగ్గురు స్టార్ ఆల్ రౌండర్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తుంది. ఇక        స్క్వాడ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్ గా ట్రావిస్ హెడ్ వ్యవహరించే అవకాశం ఉంది. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్,స్పెన్సర్ జాన్సన్ లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి చక్కని అవకాశం. ఆస్ట్రేలియా 2006 మరియు 2009లో రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. మరో వారంలో జరగనున్న ఈ టోర్నీ తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 
       
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోల్లీ