గురువు 22.03.2023 నుంచి మళ్లీ ఉగాది వరకు దశమంలో తామ్రమూర్తిగా సంచారం. శని 22.03.2023 నుంచి మళ్లీ ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 తామ్రమూర్తిగాను, తదుపరి ఉగాది వరకు లోహమూర్తిగా సంచారం. కేతువు 22.03.2023 నుంచి తామ్రమూర్తిగాను 30.10.2023 నుంచి లోహమూర్తిగా తదుపరి ఉగాది వరకు సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. రైతు సోదరులకు ముహూర్త బలంతో పంటల దిగుబడి బాగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సామాన్య లాభాలు ఉంటాయి. డాక్టర్లు, ఇంజినీర్లకు డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా సర్దుకొనిపోగలరు. కాంట్రాక్టర్లకు లాభాలు సాధారణం. సిమెంటు, టింబర్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ధరలు నిలకడగా ఉండవు. చిన్న పరిశ్రమల వారికి సామాన్య లాభాలు. పెద్ద పరిశ్రమల వారికి అధిక లాభాలు ఉంటాయి. కానీ, అది డబ్బు విషయంలో కనిపించదు. ఫార్మా ఇండస్ట్రీ, బల్క్ డ్రగ్స్ వారికి అనుకూలంగా ఉన్నా ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు సామాన్య లాభాలు. షేర్లకు సంబంధించిన వ్యాపారాలు అర్థం కావు. విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆడ పిల్లలకు మంచి మార్కులు రాగలవు. లంచం తీసుకునే ఉద్యోగులపై ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉంది. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. సీరియల్ తీసే వారికి సామాన్య లాభాలు. అపాయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మగ్లింగ్ చేసేవారికి జైలు జీవితం తప్పదు. విదేశీయానం అనుకూలం. వివాహ యత్నాలు ఫలిస్తాయి. నిల్వ ఉన్న డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చవుతుంది. ఇళ్లు, ఇతర డెవలప్‌మెంట్ పనుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వలన కష్టాల్లో చిక్కుకుంటారు. ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వొద్దు. ఓర్పు, నేర్పుతో మాట్లాడితే విజయం మీదే. లాజిక్స్ నేర్చుకోవాలి. దీని వలన ఎంత పెద్ద సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుంది.
మృగశిర నక్షత్రం వారు పగడం ధరించి సుబ్రమణ్యేశ్వర స్వామి పూజలు చేయండి. మంగళవారం రోజున గోవుకి 450 గ్రాముల కందులు నానపెట్టి దానాగా పెట్టండి. ఆరుద్ర నక్షత్రం వారు జాతి గోమేధికం ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో మహావ్యాస రుద్రాభిషేకం చేయుట వలన దోష భయం తగ్గుతుంది. ప్రతి నెలలో చేయించుకుంటే గ్రహ బలం పెరిగి ఆర్థికంగా స్థిరపడగలరు. దుర్గాదేవికి కుంకుమ పూజ, అష్టోత్తర సహస్ర నామ అర్చన చేయుట వలన ఇంట్లో శాంతి ఉంటుంది. శుక్రవారం, మంగళవారం పూలమాల, నిమ్మకాయల దండతో పూజ చేస్తే శుభ పరిణామాలు కలుగుతాయి. శత్రువులు అంతరించిపోగలరు. పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం ధరించి షిరిడీ సాయిబాబాకు పూజలు చేయాలి. గురువారం శనగలు, పసుపు వస్త్రాల దానం, శనగల్ని గుగ్గిళ్లు చేసి సాయంత్రం పూజల అనంతరం ప్రసాదములు పెట్టండి. ఇవన్నీ చేస్తే గురుబలం దైవ బలం ఉంటుంది. నవగ్రహ జపాలు, ప్రదక్షిణలు, దానాలు ఇవ్వడం వలన శత్రువులు మిత్రువులుగా మారతారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా జరుగుతాయి. ఆర్థికంగా సంతృప్తికరం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక విధాలుగా అభివృద్ధి. మీరు నమ్మకంతో ఉండాలి. ఇంట్లో అఖండ దీపారాధన, కుసుమ నూనెతో దీపం తేజస్సును పెంచుతుంది. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. నిరంతరం భగవంతునిపైన నమ్మకం, విశ్వాసంతో ధ్యానం లేక నామస్మరణం చేయాలి. అదృష్ట సంఖ్య–5.
మిథున రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అతి నమ్మకాలు పనికిరావు. ఎవరికి ఏ విధమైన హామీలు ఇవ్వొద్దు. ఆరుద్ర నక్షత్రంలో మహాన్యాస రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు, గురువులను సేవించడం మంచిది.
వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని అనుకూలంగా కనిపించినా గ్రహ కలయిక బాగాలేదు. తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేయండి. తోటి వారితో చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండటం వలన నిందారోపణలకు గురికారు. అమ్మవారికి నిత్య దీపారాధన చేయడం మంచిది.
జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించును. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం. మీరు ఇతరులను వినయంగా పలకరించండి. వాదోప వాదాలకు సమయం కాదు. ఎవరేం చెప్పినా వినండి. కానీ... నమ్మకండి.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొంత అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొత్త స్నేహితులు వల్ల అభివృద్ధి ఉంటుంది. కానీ, వారిపై అతి నమ్మకం వద్దు. నమ్మితే మోసం చేస్తారు. కొన్ని వ్యవహారాల దగ్గర మొహమాటం పనికిరాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. నమ్మకంతో దుర్గాదేవికి అవసరమైన పూజలు చేయండి.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా కనిపించినా సమస్యలు తొలగిపోతాయి.
ఆర్థికంగా చిక్కులు ఉంటాయి. అవసరానికి డబ్బు వస్తుంది. ఏదైనా అవకాశం వస్తే డబ్బు పెట్టుబడి లేని వ్యాపారం చేయండి. లక్ష్మీదేవికి పూజలు చేయడం మంచిది.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు రోజురోజుకూ ఏదో తెలియని సమస్యలు వస్తున్నా.. మీరు నమ్మిన దేవతారాధన చేయడం వలన సంతోషాన్ని ఇస్తుంది. రెండవ వారంలో ఆకస్మిక ధనలాభం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించి, ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహ కలయిక వలన కొంత ఉపశాంతి ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేసి, విజయం సాధించండి. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి మాట్లాడుకోవడం వలన సుఖ సంతోషాలతో పాటు అనుకోని విధంగా లాభం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణలు 45 సార్లు చేయండి.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలమైన రోజులు. ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. వారిపై ఒత్తిడి చేయండి. ఆకస్మిక ధన లాభం ఉంది. జాయింట్ వ్యాపారాలు కలిసిరావు. దుర్గమ్మకు పూజలు చేయండి. కార్యసిద్ధి ఉన్నది. అఖండ దీపారాధన చేయండి. అమ్మవారిని అలంకరించి పూజలు చేయండి.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడి లేని వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం ఉంది. మెల్లిగా మాట్లాడాలి. ఇంట్లో పెద్దగా పెద్దగా మాట్లాడుతూ, అరుచుకోవడం మంచిదికాదు. అమ్మవారు ఉన్న ఇంట్లో శాంతంగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. మహామృత్యుంజయ మంత్రం చేయండి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనైనా సమన్వయం కలిగి సామరస్య ధోరణితో మాట్లాడాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతుంది. ఆకస్మికంగా ధన రాబడి. చక్కగా ప్లాన్ చేసుకోండి. గురువుని పట్టుకుంటే పనులు పూర్తి అవుతాయి.
పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో అనారోగ్య సూచనలు. ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా లాభం ఉన్నది. ఇంట్లో శాంతి పూజలు చేయండి.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. విందులు, వినోదాలు, బంధు మిత్రుల కలయికతో ఆనందంగా ఉంటారు. ప్రతి విషయంలో సామరస్య ధోరణి కలిగి అందరితో అనుకూలంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఉన్నవి. అమ్మవారికి శాంతి పూజలు చేయండి.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ, పురుషులకు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు, ఆర్భాటాలు తగ్గించుకోవాలి. ఆకస్మిక ధన ఆదాయం ఉన్నది. పనులు చేసే విషయంలో వెనక్కి తగ్గకండి. ధైర్యంగా ముందుకెళ్లండి. లక్ష్మీనారాయణుడికి అలంకారం చేయించండి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నామం జపించండి.