
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ మివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల రెవెన్యూ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం బిజినెస్ విస్తరిస్తామని, తయారీ సామర్ధ్యాన్ని పెంచుతామని, మార్కెటింగ్ స్ట్రాటజీని మెరుగుపరుస్తామని కంపెనీ ఫౌండర్లు మిధుల దేవభక్తుని, కందుల విశ్వనాథ్ వివరించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,500 మంది పనిచేస్తుండగా, 2024–25 లో రూ. 300 కోట్ల రెవెన్యూ సాధించింది.
ఐఓటీ డివైస్‌లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీలు, స్పీకర్లు వంటి కొత్త కేటగిరీలలోకి అడుగుపెడతామని ఫౌండర్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆడియో, మొబైల్ యాక్సెసరీ ప్రొడక్ట్‌లను మరింత మెరుగ్గా మారుస్తామని అన్నారు. కంపెనీ ఇటీవల ఏఐతో పనిచేసే ఇయర్‌బడ్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.
ఈ ప్రొడక్ట్‌తో రెవెన్యూ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఐపీఓకి రావాలని కూడా చూస్తోంది. మివి హైదరాబాద్‌లో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. జూన్ చివరిలో ఇది అందుబాటులోకి వస్తుంది.