G7 సమ్మిట్..మనని ఎందుకు పిలిచారంటే..

టాప్​–10 ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఇండియాది ఆరో స్థానం. కొనుగోలు శక్తిని పోలిస్తే మన దేశానిది మూడో స్థానం.  ఏటా జీడీపి పెరుగుదల రీత్యా చూసినప్పుడు ఇండియా 7.4 శాతంతో మంచి పొజిషన్​లో ఉంది. ‘ఇలాంటి దశలో ఇండియా లేకుండా జీ–7 దేశాల సమ్మిట్​ జరిపితే అర్థం ఉండదు. చాలా అంశాల్లో ఇండియా ప్రమేయం లేకుండా ముందడుగు వేయలేం. ఇండియా జీ–7 సమ్మిట్​లో పాల్గొనడం చాలా ముఖ్యం’ అన్నారు ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ ఎమ్మాన్యుయేల్​ మెక్రాన్​. ఆయన ఇందుకు తగినట్లే ‘గ్రూప్​ ఆఫ్​ సెవెన్​ (జీ–7)’ సమ్మిట్​లో కొన్ని మార్పులుకూడా చేశారు. ఫ్రాన్స్​ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పారిస్​ బయలుదేరారు. మోడీ ఈ నెల 22న ఫ్రాన్స్​, అరబ్​ ఎమిరేట్స్​, బహ్రెయిన్​ దేశాల పర్యటనకు వెళ్లి, అక్కడి దేశాధినేతలతో చర్చలు జరిపి, మరలా ఫ్రాన్స్​ చేరుకున్నారు. జీ–7 సమ్మిట్​ ఫ్రాన్స్​లోని మంచి టూరిస్ట్​ ప్లేస్​ బియారిట్జ్​లో 26 వరకు జరగబోతోంది.

ఇండియా గ్రోత్​ స్పష్టం

ఇంతకీ ఈ గ్రూప్​ ఆఫ్​ సెవెన్​లో ఇండియాకి ప్రాధాన్యమివ్వడమేమిటి? ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిన నాన్​–కమ్యూనిస్టు దేశాల కూటమి ఇది. దీనిలో అమెరికా, బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇటలీ, జపాన్​ సభ్యులుగా ఉన్నాయి. ఇండియా గ్రోత్​ స్పష్టంగా కనబడుతుండడంవల్ల, రాజకీయంగా స్థిరత్వం ఉన్నందువల్ల, ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో మానవ వనరులు, మార్కెటింగ్​ సదుపాయంవల్ల, ఇక్కడ కొనుగోలు శక్తి (పర్చేజింగ్​ పవర్​ పారిటీ–పీపీపీ)వల్ల జీ–7 దేశాలు మన దేశాన్ని పక్కనబెట్టేసే అవకాశం లేకపోయింది.

మూడు రోజులపాటు జరిగే జీ–7 సమ్మిట్​లో రెండు రోజులు గడిచిపోయాయి. అమెరికా సహా ఏడు అభివృద్ధి చెందిన దేశాలు… ప్రపంచ పరిణామాలు, గల్ఫ్​లో ఇరాన్​ సంక్షోభం,  ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో చైనా దూకుడు, గ్లోబల్​ వార్మింగ్​, పర్యావరణానికి కలుగుతున్న హాని వంటి వివిధ అంశాలపై చర్చలు జరిపాయి. మరో వంక అమెరికా తనకు పోటీగా ఉంటాయనుకునే దేశాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ కంట్రోల్​ చేయాలనుకుంటోంది. తాజాగా ఫ్రాన్స్​పైకూడా ఇదే బెదిరింపులకు దిగింది. అమెరికా సంస్థలు చైనాలో ప్రొడక్షన్​ యూనిట్లు పెట్టుకోవడాన్నికూడా అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ తప్పుబడుతున్నారు. తమ రక్తాన్ని పీల్చేస్తున్న జలగలా చైనాని తిట్టిపోశారు. ‘మన కంపెనీలన్నీ మన దేశంలోనే వస్తువులు తయారు​ చేయాలి. లేదంటే వేరే దారి​ వెదుక్కోండి. చైనానుంచి బయటకు రండి’ అని ఓపెన్​గా ట్రంప్​ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రెసిడెంట్​ని ఐస్​ చేయడంకూడా జీ–7 సమ్మిట్​లో ఒక ఇన్​డైరెక్ట్​ అజెండాగా మారింది.ఇండియాకి కూడా ఈ సమ్మిట్​కి హాజరవడం చాలా ముఖ్యం. కొరుకుడు పడని సమస్యలా మారిన జమ్మూ కాశ్మీర్​ విషయంలో మోడీ సర్కారు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది.  జీ–7 సదస్సుకి హాజరైన ట్రంప్​తో మోడీ ప్రత్యేకంగా సమావేశమై… కాశ్మీర్​ ఇష్యూతో పాటుగా రెండు దేశాల మధ్య ఎగుమతి–దిగుమతి వాణిజ్యంపై వెసులుబాటు వంటి అంశాల్ని చర్చించనున్నారు.

గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ–7)

జీ–7 అనేది ఏడు దేశాల కూటమి. ప్రపంచంలో పరిశ్రమలు పెద్ద మొత్తంలో ఉన్న, అభివృద్ధి చెందిన దేశాలు ఇలా గ్రూపులా ఏర్పడ్డాయి. ఇందులోని సభ్య దేశాలు.. 1. ఫ్రాన్స్​ 2. ఇటలీ 3. జపాన్​ 4. జర్మనీ 5. కెనడా 6. అమెరికా 7. బ్రిటన్​​. ఈ దేశాల ప్రభుత్వాధినేతలు ఏటా ఓసారి సమావేశమై ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ఈ లిస్టులో గ్లోబల్​ ఎకానమీ​, పొలిటికల్​, సోషల్​, సెక్యూరిటీ ఇష్యూస్​ ఉంటాయి. జీ–7లో యూరోపియన్​ యూనియన్​ (ఈయూ) అఫీషియల్​ మెంబర్​ కాకపోయినా 1977 నుంచి ఈ సదస్సులకు యూనియన్​ రిప్రజంటేటివ్​లు​ హాజరవుతున్నారు. 1973లో చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఆర్థిక, రాజకీయ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. వీటిని చర్చించటానికి జీ–7 కూటమి ఏర్పాటైంది. యామ్​ కిప్పూర్​ యుద్ధంలో ఇజ్రాయెల్​కు సపోర్ట్​ చేస్తున్నాయనే కోపంతో ఒపెక్​ (​ఆర్గనైజేషన్​ ఆఫ్​ పెట్రోలియం ఎక్స్​పోర్ట్​ కంట్రీస్​) వివిధ దేశాలకు ఆయిల్​ సప్లయి ఆపేసింది. చమురు ధరను అమాంతం పెంచేసింది. అప్పటి నుంచి ఈ గ్రూపు చర్చించాల్సిన సమస్యల జాబితాను పెంచాయి.

గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ–20)

ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న 19 దేశాలు, యూరోపియన్​ యూనియన్​ ఈ ఫోరం ఏర్పాటు చేశాయి. ఇందులో జీ–7లో ఉన్న అమెరికా, బ్రిటన్​, జపాన్​, జర్మనీ, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్​లతోపాటు ఇండియా, మెక్సికో, ఇండోనేసియా, బ్రెజిల్,  ఆస్ట్రేలియా, అర్జెంటీనా, రష్యా,  సౌతాఫ్రికా,  సౌత్​ కొరియా,  సౌదీ అరేబియా,  చైనా, టర్కీ, యూరోపియన్​ యూనియన్​ సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమి మొత్తం ప్రపంచ జనాభాలో రెండు వంతులకు ప్రాతినిధ్యం వహిస్తోంది.  ఈ ఫోరం ముఖ్యంగా గ్లోబల్​ ఎకానమీ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టింది. జీ–20కి సెంట్రల్​ బ్యాంకర్లు, ఫైనాన్స్​ మినిస్టర్లు 1999లో జీ7 మీటింగ్​ సందర్భంగా రూపకల్పన చేశారు. ప్రధానంగా అప్పటి కెనడా ఫైనాన్స్​ మినిస్టర్​ పాల్​ మార్టిన్ ఆలోచనల నుంచి ఈ కొత్త బృందం పుట్టిందని చెప్పొచ్చు. మొదట్లో ఫైనాన్స్​ మినిస్టర్లు, సెంట్రల్​ బ్యాంకర్లు మాత్రమే సమావేశమయ్యేవారు. అయితే తొలిసారిగా 2008లో ఆయా  దేశాల ముఖ్య అధినేతలు కూడా భేటీ అయ్యారు.

ఐదో ఆర్థిక శక్తి

ఇండియా గ్రోత్​ రేటు చాలా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉందన్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​. ఆమె మాటల్లో ఉద్దేశం… ప్రపంచ దేశాల్లో ఇండియా ఒక్కటే స్థిరంగా గ్రోత్​ రేటుని కొనసాగిస్తోందన్న వాస్తవం చెబుతోంది. ఇప్పటికే ఫ్రెంచ్​ ఎకానమీని దాటిపోయి టాప్​–10 ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఇండియా ఆరో స్థానం ఆక్రమించింది. వచ్చే ఏడాది 2020 నాటికి బ్రిటన్​ని దాటిపోయి, అయిదో పెద్ద ఎకానమీగా ఎదగబోతోంది. 2003 నుంచి 2007 మధ్య కాలంలో 9 శాతం గ్రోత్​ రేటుని సాధించింది. ఆ తర్వాత గ్లోబల్​ ఫైనాన్షియల్​ క్రైసిస్​ వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. మరలా స్టాక్​ మార్కెట్​ బూమ్​, కరెంట్​ ఎకౌంట్​లో లోటు తగ్గడంతో పుంజుకుంది. ఈ మధ్యనే చైనాని దాటిపోయింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తయారైంది.