గ్రేటర్‎లో మిక్స్​డ్​వెదర్.. పగలు మండే ఎండ.. రాత్రి వణికించే చలి

గ్రేటర్‎లో మిక్స్​డ్​వెదర్.. పగలు మండే ఎండ.. రాత్రి వణికించే చలి
  • జనంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు 
  • దవాఖానలకు జనాల క్యూ..
  • వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి సమస్య 
  • ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు రోజూ 5 నుంచి 20 కేసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‎లో మిక్స్‎డ్ టెంపరేచర్స్​నగరవాసులను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. పగలు ఎండ, రాత్రిళ్లు చలి, తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో జనాలు అనారోగ్యంతో దవాఖానలకు క్యూ కడుతున్నారు. అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రతిరోజూ ఇలాంటి కేసులు 5-- నుంచి 10 వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రైవేటు దవాఖానల్లో ఈ కేసుల సంఖ్య10-- నుంచి 20కి వరకు ఉంటోంది. 

ఫిబ్రవరి చివరి వారం నుంచే వాతావరణ మార్పులతో పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైరల్ ఫీవర్లు, అలసట, వడదెబ్బ, కండరాల నొప్పులు, దద్దుర్లు, జలుబు, తలనొప్పి, డీహైడ్రేషన్, కడుపునొప్పి, చెమటలు, వికారం, తలతిరగడం వంటి సమస్యలతో  డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.  

మిశ్రమ వాతావరణమే కారణం 

గ్రేటర్‎లో ఫిబ్రవరి చివరి వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది. మధ్యాహ్నం వేళ ఎండ వేడితో ఉక్కపోత ఎక్కువైంది. అప్పుడప్పుడు వడగాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి కాగానే టెంపరేచర్లు తగ్గి చలి పెడుతోంది. తెల్లవారుజామున చూస్తే మంచు కురుస్తోంది. 

శివార్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇలా గత కొన్ని రోజులుగా పగలు 36, 37కు తగ్గకుండా టెంపరేచర్​నమోదవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇవి 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున ఈ టెంపరేచర్​మరో రెండు డిగ్రీల వరకూ పడిపోతోంది. శివారులో మంచు కూడా కురుస్తుండడంతో జనాలకు ఏమీ అర్థం కావడం లేదు. 

తమిళనాడు, కేరళ నుంచి గాలులు

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అటువైపు నుంచి వీస్తున్న గాలుల కారణంగా నగరంలో పగటి పూట ఎండ కొడుతూ సాయంత్రంకల్లా వాతావరణం చల్లబడుతోంది ఇండియన్​మెట్రోలాజికల్​డిపార్ట్​మెంట్ హైదరాబాద్​శాఖ అధికారిని శ్రావణి చెప్తున్నారు. 

పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల నుంచి గాలులు వీచడం కారణంగా గాలిలో తేమ శాతం కూడా తగ్గుతున్నదన్నారు. నగరంతో పోల్చుకుంటే శివారులోని వాతావరణంలో తేడా ఉంటుందన్నారు. నగరంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వాహనాలు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడం వల్ల వేడి పెరుగుతుందని, శివారులో అలాంటిదేమీ ఉండదు కాబట్టి టెంపరేచర్​మార్పు ఉంటుందన్నారు.  

త్వరలో వర్షాలు

ఇప్పటికే నగరంలో మధ్యాహ్నం ఎండ దంచి కొడుతుండగా, రాత్రి చలి విజృంభిస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి  వేడిగాలులు వీయడం మొదలైందని వాతావరణ శాఖ ఒక ప్రకటించింది. ఇది ఈ నెల 19 వరకు కొనసాగుతుందని తెలిపింది. మార్చి 13 నుంచి 18వ తేదీల మధ్య వేడి గాలులు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 18, 19 తేదీల్లో సిటీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్పింది. 

పిల్లలు, వృద్ధులకే సమస్య

మిశ్రమ వాతావరణం వల్ల సిటీలో చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి. మధ్యాహ్నం బయటకు వెళ్లేవారు వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్యలతో వస్తున్నారు. మరికొంతమంది జలుబు, తలనొప్పి, అలసటతో బాధపడుతున్నారు.  పిల్లలు,వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఇలాంటి కేసులు రోజూ 5 నుంచి 10 వరకు వస్తున్నాయి.  – అద్దంకి జయలక్ష్మి, ఆర్ఎంఓ, ఫీవర్ హాస్పిటల్