తెలంగాణలో వారం రోజులు మిక్స్​డ్ వెదర్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని, మరికొన్ని చోట్ల లైట్​ హీట్​వేవ్స్​ ఉండవచ్చని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. వెస్టర్న్​ డిస్టర్బెన్సెస్​ కారణంగా పలు జిల్లాల్లో నాలుగైదు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడగాలుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో స్వల్ప వడగాలులు వీస్తాయని వివరించింది. ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఇలాగే మిక్స్​డ్​ వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది.