మియాపూర్​లో వందల కోట్ల స్థలం కబ్జాకు యత్నం

మియాపూర్​లో వందల కోట్ల స్థలం కబ్జాకు యత్నం
  • ఫెన్సింగ్​ తొలగించి జేసీబీతో భూమి చదును
  • హెచ్ఎండీఏ అధికారుల ఫిర్యాదుతో పలువురిపై కేసు 

మియాపూర్, వెలుగు: మియాపూర్​లో కబ్జాదారులు రెచ్చిపోయారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించేందుకు అధికారులు చుట్టూ ఫెన్సింగ్​ వేస్తే..  కబ్జాదారులు వాటిని తొలగించి ఆక్రమించే ప్రయత్నించారు. శేరిలింగంపల్లి మండలం  మియాపూర్​లో సర్వే నంబర్100లో 277.5, సర్వే నంబర్​ 101 లో 273.34 ఎకరాలు కలిపి మొత్తం 551 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై కొన్నేండ్లుగా వివాదం నడుస్తుంది. ఇది ప్రభుత్వ స్థలమేనని గతంలో హైకోర్టు తీర్పు నివ్వగా, ప్రైవేటు వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏడాది కిందట ఇదే భూమిలో పెద్ద ఎత్తున ప్రజలు గుడిసెలు, తాళ్లు కట్టి ఆక్రమించేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేశారు. 

ఈ క్రమంలో శుక్రవారం కొందరు వ్యక్తులు మియాపూర్ ఎంఏ నగర్ కాలనీ సమీపంలో జేసీబీ సహాయంతో ఫెన్సింగ్​ను తొలగించి, చదును చేస్తూ ఆక్రమించే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని తొలగించిన ఫెన్సింగ్​ను పరిశీలించారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు పాల్పడుతుంది వెంకటేశ్వర్​రావుగా గుర్తించి, అక్కడే పనిచేస్తున్న జేసీబీ డ్రైవర్ దత్తు, మరికొందరిపై మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జేసీబీని స్వాధీనం చేసుకొని స్టేషన్​కు తరలించారు.