డెలివరీ బాయ్​గా రెక్కీ వేసి చోరీలు​ .. 16 లక్షల సొత్తు స్వాధీనం

డెలివరీ బాయ్​గా రెక్కీ వేసి చోరీలు​ .. 16 లక్షల సొత్తు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు :  మార్నింగ్ టైంలో డెలివరీ బాయ్​అవతారం ఎత్తి  తాళం ఉన్న ఇండ్లను గుర్తిస్తాడు. రాత్రిపూట వెళ్లి ఇంట్లోని బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్తాడు. పోలీసులకు  దొరకకుండా తప్పించుకు తిరిగే బీటెక్​ డిస్ కంటిన్యూ చేసిన యువకుడిని మియాపూర్​పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద రూ. 16 లక్షల విలువైన బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకోగా.. వివరాలను  మాదాపూర్​ జోన్​డీసీపీ జి. వినీత్ ​తెలిపారు. 

 ఏపీలోని  శ్రీకాకుళం జిల్ల కడకోల మండలం విక్రంపురం గ్రామానికి చెందిన బబ్బాడి అభిలాష్​(29) నాగ్​పూర్​లోని ఓ కాలేజీలో  బీటెక్​ మెకానికల్​ఇంజనీరింగ్​చదువు మధ్యలోనే మానేశాడు.  హైదరాబాద్​కు వచ్చి కేపీహెచ్​బీ హెచ్ఎంటీ హిల్స్ లో ఫ్రెండ్స్​తో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ అభిలాష్ ఈజీ మనీ కోసం చోరీలను ఎంచుకున్నాడు. తాళం వేసిన ఇండ్లను ఉదయం డెలివరీ బాయ్​గా వెళ్లి గుర్తిస్తాడు. 

రాత్రిపూట వెళ్లి చోరీ చేస్తాడు. ఇందుకు బాలానగర్​ ఇండస్ట్రియల్​ఏరియాలో భారీ కట్టర్​ను కొనుగోలు చేశాడు. అభిలాష్​ ఏడాదిన్నరలో 20  చోరీలు చేశాడు.  సొత్తును జైసింగ్​అనే వ్యక్తికి అమ్మేస్తాడు. వచ్చిన డబ్బులతో వేరే ప్రాంతాలకు కొన్ని రోజులు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తాడు.  మియాపూర్​ పీఎస్ పరిధిలో వరుస చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశాడు. అతడి వద్ద 26 తులాల బంగారు నగలు, 300 గ్రాముల వెండి నగలు, 2 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు.  సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి, మియాపూర్​ ఏసీపీ, ఇన్​స్పెక్టర్​ పాల్గొన్నారు.