జర్నలిస్ట్​ గాంధీ

గాంధీజీ  స్వతంత్ర సమరయోధుడే కాదు ఓ మంచి జర్నలిస్టు కూడా. గాంధీ దృష్టిలో జర్నలిజం అంటే  ప్రజలకు సేవ చేసే ఓ ప్లాట్ ఫాం.  ‘ది ఇండియన్ ఒపీనియన్’, ‘యంగ్ ఇండియా ’ ,  ‘నవ జీవన్ ’,  ‘ హరిజన్ ’… ఈ నాలుగు పత్రికలకు ఆయన  ఎడిటర్ గా పనిచేశారు. జర్నలిజంపై ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. విలువలతో కూడిన జర్నలిజమే అసలైన జర్నలిజం అనేవారు ఆయన. జర్నలిస్టులు ప్రొఫెషనల్ గా రాజీపడటాన్ని ఏమాత్రం అంగీకరించేవారు కాదు. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించడానికి పత్రికలను వేదికలుగా గాంధీజీ ఉపయోగించుకున్నారు. 

దక్షిణాఫ్రికాలో గాంధీజీ అక్కడివారికి ఓటు, దాని విలువల గురించి కరపత్రాలతో ప్రచారం చేశారు. అప్పట్లోనే కొన్ని వేలల్లో ప్రింట్​ చేసి డిస్ట్రిబ్యూట్​ చేయించి, ప్రతి ఒక్కరూ దానిని పూర్తిగా చదివాక, తమ ఉద్యమానికి చందా ఇచ్చేలా కార్యకర్తలను పురమాయించారు. అదే స్ఫూర్తితో ఆయన తన ఫీనిక్స్​ సెటిల్​మెంట్​లో ‘ఇండియన్​ ఒపీనియన్​’ని ఆరంభించారు.  ఎడిటర్​గా మాత్రమే కాకుండా… అవసరాన్నిబట్టి కంపోజిటర్​, ప్రూఫ్​ రీడర్​, ప్రింటర్​–కమ్​–డిస్ట్రిబ్యూటర్​గా బాధ్యతలు మోశారు. ఆ తర్వాత ఆయన యంగ్​ ఇండియాని ఇంగ్లీష్​లో, హరిజన్​, నవజీవన్ పత్రికలను హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. అలసట అనే మాట గాంధీజీ డిక్షనరీలో లేదు. దేశమంతా పర్యటిస్తున్న రోజుల్లోసైతం పత్రికలకు ఎడిటోరియల్​ని, ఇతర కంటెంట్​ని సకాలంలో అందేలా చూసుకునేవారు.గాంధీ ఏం రాసినా అందులో హ్యూమన్ ఎలిమెంట్ తప్పనిసరిగా ఉండేది. అందుకే ఆయన రచనలకు ఒక విశిష్టత లభించింది. “ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటికి అక్షరరూపం ఇవ్వడమే ఏ పత్రికకైనా ప్రధాన కర్తవ్యం ” అని గాంధీజీ అనేవారు.

‘ వెజిటేరియన్ ’ పత్రికకు ఆర్టికల్స్

గాంధీజీ 19 ఏళ్ల వయసులో లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ న్యూస్ పేపర్ చదివారు. అప్పటివరకు ఆయన ఏ రోజూ పత్రిక చదివి ఎరగరు. ఇదే విషయాన్ని ఆయన తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఈ సంఘటన ఆయనపై బాగా ప్రభావం చూపింది. ఆ తరువాత ‘వెజిటేరియన్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్’ వాళ్లు నడిపే ‘వెజిటేరియన్’ అనే పత్రికకు ఆయన వ్యాసాలు రాయడం మొదలెట్టారు. లండన్​లో ఉన్న మూడేళ్ల కాలంలో ఇండియన్స్ ఫుడ్ హ్యాబిట్స్, కల్చర్, పండుగల పై ఆయన ‘ వెజిటేరియన్ ’ జర్నల్ కు వ్యాసాలు రాసేవారు. ఈ అనుభవంతో  గాంధీ  ఫ్రీ లాన్స్ జర్నలిస్టు గా మారారు. లండన్ నుంచి సముద్రమార్గం లో ఆయన ఇండియాకు బయల్దేరినప్పుడు వాతావరణం బాగా లేదు. సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయట.  ఈ పరిస్థితి పై  ఆయన ‘వెజిటేరియన్’ పత్రికకు ఓ చక్కటి ఆర్టికల్ రాశారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు ఈ ఆర్టికల్ ఎంతో ఇన్ స్పిరేషన్ గా పనిచేసిందట.

సౌతాఫ్రికాలో ‘ ఇండియన్ ఒపీనియన్ ’

సౌతాఫ్రికాలో ఉన్నప్పుడే కొంతమంది ఇండియన్స్ సాయంతో తన తొలి పత్రిక ‘ఇండియన్ ఒపీనియన్’ ను 1903 జూన్ 4న గాంధీజీ ప్రారంభించారు. ‘మనం’ ( Ourselves) పేరుతో ఆయన రాసిన తొలి ఎడిటోరియల్​కు  మంచి ఆదరణ లభించింది.

వాడుక భాషకే గాంధీ ప్రయారిటీ

గాంధీ భాష లో ఎక్కడా బరువైన పదాలుండవు.  సగటు రీడర్ కు అర్థమయ్యేట్లు వాడుక భాషలోనే రాయడం గాంధీజీ స్పెషాలిటీ. అందుకే ఆయన వ్యాసాలు కానివ్వండి ఎడిటోరియల్స్ కానివ్వండి రీడర్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇండియన్ ఒపీనియన్ అప్పట్లో ఇంగ్లీషు, గుజరాతీ, తమిళం, హిందీ మొత్తం నాలుగు భాషల్లో  పబ్లిష్  అయ్యేది. గాంధీ కేవలం రాయడం తోనే సరిపెట్టుకోలేదు. పత్రిక ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆదుకోవడానికి  సొంత డబ్బు ఖర్చు పెట్టేవారు. ప్రింటింగ్ మిషనరీలో టెక్నాలజీ పరంగా తరచూ ప్రాబ్లమ్స్ వస్తుండేవి. ప్రెస్ వర్కర్లే  మాన్యువల్ గా ప్రింట్ చేసేవారు. గాంధీ కూడా వారితో కలిసిపోయేవారు.

పాపులర్ పత్రికహరిజన్

గాంధీజీ ఎడిటర్ గా పనిచేసిన వాటిలో ‘ హరిజన్ ’ పత్రిక ఎంతో ముఖ్యమైనది. దేశంలోని దళితుల జీవన పరిస్థితులపై  ఈ పత్రిక ఎక్కువగా ఫోకస్ చేసేది. అన్ని రంగాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై  గాంధీజీ వివరంగా రాసేవారు. దళితుల ఇష్యూస్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని  దుర్భర పరిస్థితులను ఈ పత్రిక కవర్ చేసేది.

యంగ్ జర్నలిస్టులకు ప్రోత్సాహం

యంగ్ జర్నలిస్టులను గాంధీజీ మొదట్నుంచి బాగా ప్రోత్సహించేవారు. దేశానికి నాలుగు మంచి పనులు చేయాలన్న తపన ఉన్న వారే జర్నలిజాన్ని  ప్రొఫెషనల్ గా తీసుకోవాలని అనేవారు. పేదలపై నెగెటివ్ ప్రభావం చూపే రాతలను రాయకూడదన్నది ఆయన సిద్ధాంతం. యంగ్ జర్నలిస్టులను ఎంక రేజ్ చేయడానికి  ఇంటర్వ్యూలు  కూడా ఇచ్చేవారు.

ట్రైన్ జర్నీల్లో కూడా రాసేవారు

ఎంత బిజీగా ఉన్నా  పత్రికలకు ఎడిటోరియల్, వ్యాపాలు రాయడానికి గాంధీజీ తీరిక చేసుకునేవారు. చాలాసార్లు ట్రైన్ లో వెళుతూనే టైప్ రైటర్ పై ఆయన రచనలు చేసేవారు. రైలు ఎంత స్పీడుగా వెళ్తున్నా ఎక్కడా ఒక చిన్న తప్పు  లేకుండా టైప్ చేసి, ఆ రచనలను పత్రికలకు సకాలంలో పంపేవారు.

పత్రికల నిర్వహణలో​ ఆల్​ఇన్​ వన్​

గాంధీజీ కేవలం రాయడానికి, ఎడిటింగ్ చేయడానికి మాత్రమే పరిమితమైన జర్నలిస్టు కాదు. ఒక న్యూస్ పేపర్, మార్కెట్ లోకి రావడానికి అవసరమైన అన్ని విద్యలు ఆయనకు వచ్చు. కంటెంట్ పైనే కాదు అప్పటి టెక్నాలజీ పై కూడా ఆయనకు పట్టు ఉండేది. గాంధీజీకి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

వార్ కరస్పాండెంట్గా..

దాదాభాయ్ నౌరోజీ మనదేశంలో ప్రారంభించిన ‘ఇండియా’ అనే పత్రికకు గాంధీ కొంతకాలం సౌతాఫ్రికా నుంచి వార్ కరస్పాండెంట్ గా పనిచేశారు. గాంధీజీ అక్కడ ఉన్నప్పుడే  బ్రిటిష్ బలగాలకు, సౌతాఫ్రికాకు మధ్య యుద్ధం మొదలైంది. ఇదే చరిత్రలో బోయర్ యుద్ధంగా పాపులరైంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటి పరిస్థితులను  వార్ కరస్పాండెంట్​గా ఆయన కళ్లకు కట్టినట్లు రాసి ‘ఇండియా’ పత్రికకు పంపేవారు. ఆర్టికల్స్ రాయడంతోనే  గాంధీజీ సరిపెట్టుకోలేదు. గాయపడ్డవారికి వాలంటీర్ల టీంతో సేవలు అందచేశారట.

సెన్సేషనలిజానికి వ్యతిరేకం

సెన్సేషనల్ రాతలకు గాంధీజీ పూర్తి వ్యతిరేకం. ‘ సెన్సేషన్ ’ పేరుతో సమాజంలోని వివిధ వర్గాల మధ్య విషం చిమ్మే  రాతలను ఆయన సమర్థించేవారు కాదు. 1931 మే 28 నాటి యంగ్ ఇండియా పత్రికలో  ‘పాయిజినస్ జర్నలిజం ’ పేరుతో ఈ విషయాన్ని  ఆయన తెగేసి చెప్పారు.

ఎడిటర్ అంటే మాటలు కాదు

ఎడిటర్ గా పనిచేయడం అంటే మాటలు కాదు అనేవారు  గాంధీజీ. ఒకసారి ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుంటే సమాజం పట్ల పూర్తి అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది అనేవారు ఆయన. అలా చేసినవారే నిఖార్సయిన జర్నలిస్టు అన్నది గాంధీజీ ఫిలాసఫీ.

సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యం

ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం అనేది నాలుగు కాలాల పాటు బతకాలంటే జర్నలిజమే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనేవారు గాంధీజీ. ఏ సమస్యపైన అయినా ప్రజలను చైతన్యపరచడమే అసలైన జర్నలిజం అన్నది ఆయన సిద్దాంతం. ఏది రాయాలో, ఏది రాయకూడదో అనే విచక్షణ జర్నలిస్టుకు ఉండాలంటారు గాంధీజీ. అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరిగే రాతలే రాయాలంటారు. జర్నలిస్టులకు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అంటారు.