గద్వాల, వెలుగు: తన ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అగ్రకుల నేతల పెత్తనం పెరిగిందని, అందుకే ఆత్మగౌరవం కోసం కారు దిగి, కాంగ్రెస్ పార్టీలో చేరానని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయం దగ్గర మీడియాతో మాట్లాడారు. తాను 15 ఏండ్లుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని చెప్పారు.
ఈసారి తనకు టికెట్ప్రకటించినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకుండా వేధించి, చివరికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోసం టికెట్ నిరాకరించారని ఆరోపించారు. సాగు, తాగు నీరు, విద్య, వైద్యంపై కనీస అవగాహన లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తాను అన్ని వర్గాలను సమానంగా చూశానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆధిపత్యం, ఆత్మగౌరవం మధ్య పోరు జరుగుతోందని, ఈ పోరులో తాను కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ పదవికో, ఇంకో పదవికో తాను ఆశపడి మద్దతు ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సంపత్ కుమార్ అర్హుడనే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. గద్వాల జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మంద జగన్నాథం కూడా ఇటీవల కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.