రాజన్నసిరిసిల్ల, వెలుగు:- రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేయాలని సూచించారు.
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా జిల్లాలోని సమస్యలు తనకు తెలుసన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి జనరల్‌బాడీ మీటింగ్‌ను వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వారంలోనే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు.. వంటి పథకాలను అమలుచేశామని, 100 రోజుల్లో ఆరు గ్యారంటీలనుఅమలు చేస్తామని చెప్పారు.
సమస్యలకు పరిష్కారం చూపాలి
జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై అధికారులు దృష్టి సారించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని జడ్పీ చైర్‌పర్సన్ అరుణ కోరారు. మండలాల్లో జరిగే అభివృద్ధి పనులపై ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు అధికారులు సమాచారమివ్వాలన్నారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ఆకునూరి శంకరయ్య, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.