
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. యాసంగి సీజన్లో వడ్ల సేకరణ– తరలింపుపై కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన వడ్లను తరలించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఐదు రూట్లలో సుమారు 500 లారీలు సమకూర్చాల్సి ఉండగా.. ప్రస్తుతం 180 లారీలే అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సన్న వడ్లను కూడా ప్రభుత్వం సేకరిస్తుందని రైతులు ఆందోళన చెందొద్దన్నారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
కోనరావుపేట, వెలుగు: రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని, కాంటా పెట్టిన వడ్లను ఎప్పటికప్పుడు తరలించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పరిశీలించారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో కడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు లబ్ధిదారు కలకుంట్ల రమణ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ రైతువేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.